నటి శారదకు జెసి డేనియల్‌ అవార్డు-2024

నటి శారదకు జెసి డేనియల్‌ అవార్డు-2024
ప్రముఖ సీనియర్‌ నటి శారద అరుదైన గౌరవం అందుకున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన జీవితకాల సేవలకుగాను కేరళ ప్రభుత్వ అత్యున్నత సినీ పురస్కారం ‘జెసి డేనియల్‌ అవార్డు-2024’కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేరళ సాంస్కఅతిక వ్యవహారాల శాఖ మంత్రి సాజి చెరియన్‌ తిరువనంతపురంలో అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 25న తిరువనంతపురంలో జరిగే కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చేతుల మీదుగా శారద ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కింద రూ. 5 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేస్తారు.  గీత రచయిత, చిత్ర నిర్మాత కుమారన్‌ తంపి నేతృత్వంలోని జ్యూరీ 80 ఏళ్ల శారదను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. దీంతో ఈ అవార్డు అందుకోనున్న 32వ వ్యక్తిగా శారద నిలవనున్నారు. 1960 నుంచి రెండు దశాబ్ధాలకు పైగా అనేక చిత్రాల్లోని గొప్ప పాత్రాల ద్వారా మలయాళీ మహిళలకు ప్రతినిధిగా శారద నిలిచారని జ్యూరీ పేర్కొంది. 
ఆ కాలంలో మలయాళీ మహిళల బాధలను, ద్ణుఖాన్ని తన నటన ద్వారా శారద వ్యక్తీకరించారని జ్యూరీ ప్రశంసించింది. త్రివేణి, మురప్పెన్ను, మూలధనం, ఒరు మిన్నమినుంగింటే నూరుంగువేట్టం.. వంటి చిత్రాల్లోని శారద పోషించిన మరపురాని పాత్రలను జ్యూరీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. తెలుగు నటే కానీ, మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి పాత్రలెన్నో పోషించి.. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా విఖ్యాతిగాంచారు.
తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో అవిశ్రాంతంగా సినిమాలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో 1945 జూన్‌ 25న శారద పుట్టింది. ఆమె మొదటి సినిమా 1955లో వచ్చిన ‘కన్యా శుల్కం’లో చాలా చిన్న పాత్ర. శారద అనే నటి ఒకరు ఉన్నట్టు గుర్తింపు తీసుకు వచ్చిన చిత్రం 1961లో వచ్చిన ‘ఇద్దరు మిత్రులు’.

సినీ కెరీర్‌లో మూడుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. 1968లో మలయాళ చిత్రం ‘తులాభారం’, 1972లో ‘స్వయంవరం’ చిత్రాలకు ఈ అవార్డులు ఆమెకి దక్కాయి. 1977లో ‘నిమజ్జనం’ తెలుగు సినిమాకిగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 1997లో ఫిలిం ఫేర్‌ జీవన సాఫల్య పురస్కారం, 2010లో ఎన్టీఆర్‌ జాతీయ జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు.