విమానాల రద్దుకు ఇండిగోకు రూ. 22.20 కోట్ల జరిమానా

విమానాల రద్దుకు ఇండిగోకు రూ. 22.20 కోట్ల జరిమానా

దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) రూ. 22.20 కోట్ల జరిమానా విధించింది. గత డిసెంబర్‌లో భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దుకావడంపై దర్యాప్తు జరిపిన డీజీసీఏ ఈ మేరకు చర్యలు తీసుకుంది. వందలాది విమాన సర్వీసులకు అంతరాయం నేపథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయగా నివేదిక ఆధారంగా జరిమానా విధించింది. 

డిసెంబర్‌ మొదటి వారంలో 2,507 విమానాలు రద్దు కాగా, 18,052 సర్వీసులు ఆలస్యంగా నడిచినట్లు కమిటీ గుర్తించింది. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన డీజీసీఏ, ఇండిగో కార్యకలాపాల నిర్వహణలో ప్లానింగ్‌, ఆపరేషనల్‌, రెగ్యులేటరీల్లో తీవ్ర లోపాలున్నాయని పేర్కొంది. ఓవర్‌ ఆప్టిమైజేషన్‌, సాఫ్ట్‌వేర్‌, నిర్వహణ పర్యవేక్షణలో లోపాలున్నట్లు గుర్తించినట్లు వెల్లడించింది. 

వీటి కారణంగా డిసెంబర్‌ 3 నుంచి 5 తేదీల్లో వందలాది విమానాలు రద్దయ్యాయని, దీంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో మూడు లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని తెలిపింది. ఇండిగో ఆపరేషన్స్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ను తప్పించాలని ఆదేశించింది. కేంద్రం కూాడా ఇండిగో నిర్వహణ వైఫల్యమే సంక్షోభ పరిస్థితులకు దారితీసిందని తెలిపింది. సిబ్బందికి సంబంధించిన రోస్టరింగ్ విధానాన్ని సరిగా అమలుచేయలేదని, ఈ వైఫల్యానికి ఏఎంఎస్‌ఎస్‌ సిస్టమ్ కారణం కాదని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు తెలిపారు.

డిసెంబర్ 1న రోస్టరింగ్ నిబంధనలకు సంబంధించి ఇండిగోతో సమావేశం నిర్వహించామని, ఆ సంస్థ ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలపై తాము స్పష్టత ఇచ్చామని తెలిపారు. అప్పుడు వారు ఎలాంటి సమస్యలను ప్రస్తావించలేదని పేర్కొన్నారు. అనంతరం రద్దయిన, ఆలస్యమైన ‘ఇండిగో’ విమానాల టికెట్ల రీఫండ్‌కు సంబంధించి రూ.610 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు పౌర విమానయానశాఖ ప్రకటించింది.