ఇరాన్లో పరిస్థితులు రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న పలువురు భారతీయులు శుక్రవారం అర్ధరాత్రి న్యూడిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నారు. ఇరాన్లో భద్రతా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన అనంతరం భారతీయులు అక్కడి నుంచి తిరిగివచ్చారు.
సంవత్సరం లోపే హింసతో అట్టుడుకుతున్న ఇరాన్ నుండి విద్యార్థులు తిరిగి రావడం ఇది రెండోసారి. విద్యార్థులు షిరాజ్ విమానాశ్రయంలో విమానంలో బయలుదేరి, ఎయిర్ అరేబియా విమానంలో ఇక్కడకు చేరుకున్నారు. కాశ్మీర్‌కు చెందిన విద్యార్థులతో మరో విమానం కూడా టెహ్రాన్ నుండి ఢిల్లీకి చేరుకోనుంది. ఇరాన్లో ఉన్న భారతీయులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచిపెట్టాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఎ) ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే.
పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తున్నామని, భారతీయుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. “అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. భారత్ ప్రభుత్వం మాకు ఎంతో సహకరించింది. ఎంబసీ ముందుగానే సమాచారమిచ్చి, వీలైనంత త్వరగా దేశం విడిచిపెట్టేలా సహాయం చేసింది. ‘మోదీజీ ఉన్నారు అంటే అన్నీ సాధ్యమే” అంటూ తిరిగి వచ్చిన ఓ ప్రయాణికుడు భావోద్వేగంగా చెప్పారు.
మరో భారతీయుడు మాట్లాడుతూ, “మేం నెల రోజులుగా ఇరాన్లో ఉన్నాం. కానీ గత వారం, పది రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బయటకు వెళ్తే ఆందోళనకారులు కార్లను అడ్డుకునేవారు. కొంత ఇబ్బంది కలిగించేవారు. ఇంటర్నెట్ పూర్తిగా నిలిపివేయడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేక చాలా ఆందోళన చెందాం. ఎంబసీతో కూడా సంప్రదించలేకపోయాం” అని తెలిపారు.
జమ్మకశ్మీర్‌కు చెందిన మరో భారతీయుడు మాట్లాడుతూ, “ఇరాన్లో జరిగిన ఆందోళనలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అక్కడి పరిస్థితులు భయంకరంగా మారాయి. భారత ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకుని మమ్మల్ని, ముఖ్యంగా విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది” అని పేర్కొన్నారు.

More Stories
వందేమాతరం థీమ్‌తో రిపబ్లిక్ డే పరేడ్
హెచ్ఐవీ వైరస్‌ను మూలంగా తొలగించే చైనా ప్రయత్నం
శబరిమలలో మకర జ్యోతిని దర్శించుకున్న అయ్యప్ప భక్తులు