వందేమాత‌రం థీమ్‌తో రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌

వందేమాత‌రం థీమ్‌తో రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌
*న‌దుల పేర్ల‌తో ప్రేక్ష‌కుల గ్యాల‌రీలు
దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఈనెల 26వ తేదీన జ‌ర‌గ‌నున్న రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌ ను వందేమాత‌రం థీమ్‌తో నిర్వ‌హించ‌నున్నారు. క‌ర్త‌వ్య‌ప‌థ్‌పై 150 ఏళ్ల వందేమాత‌రం శోభ వెల్లువిరియ‌నున్న‌ది. జాతీయ గీతానికి చెందిన ఆర్ట్‌వ‌ర్క్‌ను ప్ర‌జెంట్ చేయ‌నున్నారు. ఆ గేయాన్ని రాసిన‌ బంకిమ్ చంద్ర ఛ‌ట‌ర్జీకి ప్ర‌త్యేక నివాళి అర్పించ‌నున్నారు. వివిధ రంగాలకు చెందిన 10వేల మందికిపైగా ప్రత్యేక అతిథులకు పంపనున్న జనవరి 26 పరేడ్ ఆహ్వాన పత్రాలపై 150 వసంతాల వందేమాతరం థీమ్‌ను అద్దంపట్టే లోగో కూడా ఉంటుంది.
దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రస్తుత వికాసాన్ని చాటిచెప్పేలా 30 శకటాలను పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. స్వతంత్రతా కా మంత్ర్ – వందే మాతరం, సమృద్ధి కా మంత్ర్ – ఆత్మనిర్భర్ భారత్ అనే థీమ్‌‌తో కూడిన శకటాలను పరేడ్ కోసం సిద్ధం చేస్తున్నారు.  గ‌తంలో రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌ను వీక్షించే వారి కోసం వివిధ ర‌కాల కేట‌గిరీల‌తో పాస్‌ల‌ను ఇచ్చేశారు. ఈ సారి కొత్త విధానాన్ని ప్ర‌వేశ‌పెడుతున్నారు. ప్రేక్ష‌కుల గ్యాల‌రీకి భార‌తీయ న‌దుల‌తో పేర్లు పెట్టారు. 
బియాస్‌, బ్ర‌హ్మ‌పుత్ర‌, చంబ‌ల్‌, చీనాబ్‌, గండ‌క్‌, గంగా, ఘాగ్రా, గోదావ‌రి, సిందు, జీలం, కావేరి, కోశి, కృష్ణ‌, మ‌హానంది, న‌ర్మ‌ద‌, పెన్నార్‌, పెరియార్, రావి, సోని, స‌ట్ల‌జ్‌, తీస్తా, వైగ‌యి, య‌మునా న‌దుల పేర్ల‌తో ప్రేక్ష‌కుల గ్యాల‌రీల‌ను పిల‌వ‌నున్నారు. ఇక జ‌న‌వ‌రి 29వ తేదీన జ‌ర‌గ‌నున్న బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ కోసం భార‌తీయ సంగీత వాద్యాల పేర్ల‌తో ఎన్‌క్లోజ‌ర్ల‌ను పిలువ‌నున్నారు. బాన్సురి, డ‌మ‌రుకం, ఎక్తారా, ఇస్రాజ్, మృదంగం, న‌గ‌డా, ప‌క్వాజ్‌, సంతూర్, సారంగి, స‌రింద‌, స‌రోద్‌, షెహ‌నాయి, సితార్, సుర్బ‌హార్‌, త‌బ‌ల‌, వీణా పేర్ల‌తో పిల‌వ‌నున్నారు. 

ఈసారి ప‌రేడ్‌లో 30 శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు చెందిన 17 శ‌క‌టాలు ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంటాయ‌ని, 13 శ‌క‌టాలు మాత్రం మంత్రిత్వ‌శాఖ‌లు, స‌ర్వీస్‌ల‌కు ఉండ‌నున్న‌ట్లు ర‌క్ష‌ణశాఖ కార్య‌ద‌ర్శి ఆర్కే సింగ్ తెలిపారు.

రిపబ్లిక్ డే పరేడ్ జరగనున్న కర్తవ్య పథ్‌ ఆవరణ చుట్టూ ప్రముఖ చిత్రకారుడు తేజేంద్ర కుమార్ మిత్రా గీసిన వందేమాతరం పెయింటింగ్‌ల ప్రింట్లను ప్రదర్శిస్తామని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వందేమాతర గేయంలోని ప్రారంభ వాక్యాలతో ఆయన అద్భుతంగా గీసిన పెయింటింగ్‌లు 1923లోనే ‘వందే మాతరం ఆల్బమ్’‌లో ప్రచురితమయ్యాయని తెలిపారు.