ఆస్తుల వివ‌రాలు ఇవ్వ‌క 159 మంది పాక్ నేత‌ల స‌భ్య‌త్వం ర‌ద్దు

ఆస్తుల వివ‌రాలు ఇవ్వ‌క 159 మంది పాక్ నేత‌ల స‌భ్య‌త్వం ర‌ద్దు

పాకిస్థాన్ కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఆస్తులు వివ‌రాలు వెల్ల‌డించ‌ని 159 మంది నేత‌ల స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసింది. పాక్ ఈసీ శుక్ర‌వారం స‌స్పెన్ష‌న్ ఆదేశాలు జారీ చేసింది. 2024-2025 సీజ‌న్‌కు చెందిన ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించేందుకు జ‌న‌వ‌రి 15వ తేదీ డెడ్‌లైన్.  అయితే ఆ డెడ్‌లైన్ ముగియ‌డంతో ఇవాళ పాక్ ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.

జాతీయ అసెంబ్లీతో పాటు ప‌లు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికైన 159 మంది నేత‌ల స‌భ్య‌త్వాన్ని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఈసీ ప్ర‌క‌టించింది. ఆస్తులు వివ‌రాలు వెల్ల‌డించే వ‌ర‌కు వాళ్ల స‌భ్య‌త్వాన్ని ర‌ద్దుగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు పాక్ ఈసీ చెప్పింది. పార్ల‌మెంట్‌కు చెందిన 32 మంది స‌భ్యుల్లో స‌య్య‌ద్ అలీ మూసా గిలానీ, ఖ‌లీద్ మ‌క్బూల్ సిద్ధిక్‌, మొహ‌మ్మ‌ద్ అక్త‌ర్ మెంగాల ఉన్నారు. ఎగువ స‌భ‌కు చెందిన ముసాదిక్ మాలిక్‌తో పాటు మొత్తం 9 మంది స‌భ్యులు స‌స్పెన్ష‌న్ ఎదుర్కొన్నారు. 

ఇక పంజాబ్ అసెంబ్లీలో 50 మంది, సింధ్ అసెంబ్లీలో 33 మంది, ఖైబ‌ర్ ఫ‌క్తున‌క్వాలో 28 మంది, బ‌లోచిస్తాన్‌లో ఏడు మంది ప్ర‌జాప్ర‌తినిధుల‌ను స‌స్పెండ్ చేశారు. 2017 ఎల‌క్ష‌న్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 137 కింద పార్ల‌మెంట్‌కు, అసెంబ్లీల‌కు ఎన్నికైన నేత‌లు త‌మ ఆస్తుల వివ‌రాల‌ను త‌ప్ప‌కుండా వెల్ల‌డించాల్సి ఉంటుంది. గ‌త ఏడాది కూడా ఆస్తుల వివ‌రాలు ఇవ్వ‌ని 139 మంది ప్ర‌జాప్ర‌తినిధులను పాక్ ఈసీ స‌స్పెండ్ చేసింది.