అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మీషోలపై రూ. 44 లక్షల జరిమానా

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మీషోలపై రూ. 44 లక్షల జరిమానా

చట్టవిరుద్ధంగా వాకీటాకీలను విక్రయిస్తున్న పలు ఈ-కామర్స్ సంస్థలపై కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సిసిపిఎ) సుమోటోగా చర్యలు చేపట్టింది. వినియోగదారుల రక్షణ చట్టం–2019తో పాటు టెలికాం నిబంధనలను ఉల్లంఘించినందుకు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మీషో, మెటా (ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్) సహా మొత్తం 8 సంస్థలకు రూ.44 లక్షల వరకు జరిమానా విధించింది. 

ఆన్‌లైన్ వేదికల్లో లైసెన్స్ అవసరమైన వాకీటాకీలను ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించిన సిసిపిఎ మొత్తం 13 ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. విచారణ అనంతరం ఎనిమిది సంస్థలపై తుది ఉత్తర్వులు జారీ చేసి జరిమానాలు విధించింది. సాధారణంగా 446.0 నుంచి 446.2  ఎంహెచ్‌జడ్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో పనిచేసే పర్సనల్ మొబైల్ రేడియోలు (పీఎంఆర్) మాత్రమే లైసెన్స్ మినహాయింపులోకి వస్తాయి. 

ఈ పరిధిని దాటి పనిచేసే వాకీటాకీలను దిగుమతి చేయాలన్నా, విక్రయించాలన్నా తప్పనిసరిగా ఎక్విప్‌మెంట్ టైప్ అప్రూవల్  సర్టిఫికెట్ తీసుకోవాలి. అలాగే, లైసెన్సింగ్‌కు సంబంధించిన వివరాలను వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనలను పక్కనపెట్టి పలు ఈ-కామర్స్ సంస్థలు అనధికార వాకీటాకీలను విక్రయిస్తున్నట్లు సిసిపిఎ గుర్తించింది. 

ఫ్రీక్వెన్సీ వివరాలు వెల్లడించకుండా, లేదా లైసెన్స్ అవసరం లేదంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలతో ఉత్పత్తులను లిస్ట్ చేసినట్లు తేల్చింది. విచారణ అనంతరం మీషో, మెటా ప్లాట్‌ఫామ్స్ (ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్), ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సంస్థలకు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించింది.  అలాగే చిమియా, జియో మార్ట్‌, టాక్ ప్రో, మాస్క్‌మ్యాన్ టాయ్స్ సంస్థలకు రూ.లక్ష చొప్పున ఫైన్ వేసింది. వీటిలో మీషో, మెటా, చిమియా, జియో మార్ట్‌, టాక్ ప్రో సంస్థలు ఇప్పటికే జరిమానాలు చెల్లించినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. మిగతా సంస్థల నుంచి చెల్లింపులు రావాల్సి ఉందన్నారు.

ఫ్లిప్‌కార్ట్‌లో వేల సంఖ్యలో వాకీటాకీలు విక్రయమైనప్పటికీ, చాలా లిస్టింగ్స్‌లో ఫ్రీక్వెన్సీ వివరాలు ఇవ్వలేదని సిసిపిఎ గుర్తించింది. అమెజాన్‌లోనూ అనుమతులు లేని ఉత్పత్తులు విక్రయమైనట్లు తేలింది. మీషోలో ఒకే విక్రేత వేల సంఖ్యలో వాకీటాకీలు విక్రయించినట్లు వెల్లడైంది. ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో లైసెన్సింగ్ వివరాలు లేకుండా వందల లిస్టింగ్స్ కనిపించాయి. 

కొన్ని సంస్థలు ‘మేము కేవలం మధ్యవర్తులమే’ అంటూ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాయి. అయితే, ఉత్పత్తుల లిస్టింగ్, ప్రచారం, అమ్మకాలను సులభతరం చేసే వేదికలు పూర్తి బాధ్యత వహించాల్సిందేనని సిసిపిఎ స్పష్టం చేసింది.