భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించి. రాష్ట్రంలోని 2,869 స్థానాలకు గాను 1,372 స్థానాలను గెలుచుకుంది. ఇందులో ఆసియాలోనే అత్యంత సంపన్న పౌర సంస్థ అయిన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో సాధించిన విజయం కూడా ఉంది. ఇక్కడ అది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఠాక్రేల ఆధిపత్యానికి తెరదించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, బీజేపీ 89 స్థానాలను గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 29 స్థానాలను గెలుచుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 65 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా, రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కేవలం ఆరు స్థానాలకే పరిమితమైంది. కాగా, కాంగ్రెస్ 24 స్థానాలను గెలుచుకుంది.
ఠాక్రేలతో పాటు, మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పుణె, పింప్రి-చించ్వాడ్‌లో పోలింగ్ సందర్భంగా పవార్ కుటుంబం తిరిగి కలవడం కూడా కనిపించింది. అయితే, వారి కలయిక కూడా ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ విజయరథాన్ని ఆపలేకపోయింది. పుణెలోని 165 స్థానాలకు గాను కడపటి వార్తలు అందేసరికి 135 స్థానాల ఫలితాలు వెలువడగా,వీటిలో బీజేపీ 96 స్థానాలను గెలుచుకోగా, ఎన్‌సీపీ, ఎన్‌సీపీ (ఎస్పీ), 20 మరియు మూడు స్థానాలను దక్కించుకున్నాయి.
బీజేపీ-శివసేన కూటమి మొత్తం 118 స్థానాలను సాధించి, 227 మంది సభ్యులున్న బీఎంసీలో 114 మెజారిటీ మార్కును దాటింది. మెజారిటీ మార్కును దాటకముందే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈసారి ముంబైకి మహాయుతి నుండే మేయర్ వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఓటును అభివృద్ధి రాజకీయాలకు ఆమోదంగా అభివర్ణించారు. “ధన్యవాదాలు మహారాష్ట్ర! రాష్ట్ర చైతన్యవంతమైన ప్రజలు ఎన్డీయే ప్రజానుకూల సుపరిపాలన ఎజెండాను ఆశీర్వదిస్తున్నారు! వివిధ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర ప్రజలతో ఎన్డీయే బంధం మరింతగా బలపడిందని సూచిస్తున్నాయి. అభివృద్ధి కోసం మా ట్రాక్ రికార్డ్, దార్శనికత ఒక సంచలనం సృష్టించాయి. మహారాష్ట్ర అంతటా ప్రజలకు నా కృతజ్ఞతలు. పురోగతికి ఊతం ఇవ్వడానికి, రాష్ట్రం ముడిపడి ఉన్న అద్భుతమైన సంస్కృతిని జరుపుకోవడానికి ఇది ఒక ఓటు” అని మోదీ తెలిపారు.
“బీజేపీ అభివృద్ధి అజెండాను ముందుకు తెచ్చింది. మేము దానిని ప్రజల ముందు ఉంచాము. వారు సానుకూలంగా స్పందించారు. మేము అనేక మున్సిపల్ కార్పొరేషన్లలో రికార్డు స్థాయిలో తీర్పును అందుకున్నాము. ఇది ప్రజలు నిజాయితీని, అభివృద్ధిని కోరుకుంటున్నారని నొక్కి చెబుతోంది. అందుకే ప్రజలు బీజేపీకి ఓటు వేశారు,” అని ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఫడ్నవీస్ పేర్కొన్నారు.
అదేవిధంగా, పింప్రి-చించ్వాడ్‌లోని 128 స్థానాలకు గాను 127 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో బీజేపీ 84 స్థానాలను గెలుచుకోగా, ఎన్‌సీపీ 36 స్థానాలను దక్కించుకుంది. కాగా, ఎన్‌సీపీ (ఎస్పీ) కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. మరోవైపు, శివసేన ఆరు స్థానాలతో మూడవ స్థానంలో నిలిచి చాలా వెనుకబడిపోయింది.
పరిమిత ఓటు బ్యాంకు కలిగిన మజ్లిస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఇంచుమించు 94 సీట్లను గెల్చుకోగలిగింది. మొదటిసారి బిఎంసిలో ఓ సీటు గెల్చుకోగలిగింది. ఛత్రపతి శంభాజీనగర్ మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా 24 స్థానాలను కైవసం చేసుకున్న ఎంఐఎం ప్రధాన పోటీదారుగా నిలిచింది. మాలెగావ్ కార్పొరేషన్ ఎన్నికల్లో 20 స్థానాల్లో గెలుపొంది. తన పట్టును నిరూపించుకుంది.
ధూలే మున్సిపల్ ఎన్నికల్లో 8 స్థానాలు, సోలాపూర్ ఎన్నికల్లో 8 సీట్లు, నాందేడ్‌లో 8 8 స్థానాల్లో విజయం సాధించింది. థానేలో 5, అమరావతిలో 6 స్థానాలను ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీకి కంచుకోట అయిన నాగపూర్‌లో కూడా ఎంఐఎం 4 స్థానాలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
.

More Stories
ఎన్డీయేలోకి బీహార్‌లో మొత్తం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు!
పదేళ్లలో స్టార్టప్స్, టెక్ విభాగాల్లో ప్రపంచ అగ్రగామిగా భారత్
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సాంకేతికత బదిలీ!