హైదరాబాద్‌లోని పురానాపుల్ దర్వాజా ప్రాంతంలో ఉన్న మైసమ్మ ఆలయంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫ్లెక్సీ బ్యానర్‌ను చించివేసి, దేవతా విగ్రహాలను అపవిత్రం చేయడంతో హిందువులు ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు. చిన్న దేవి ఆలయం ఉన్న పూర్ణపుల్ దర్వాజా, అపారమైన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీశైలం యాత్రకు వెళ్ళినప్పుడు ఇదే ప్రదేశంలో బస చేశారని భావిస్తారు.
హిందువులు ఆగ్రహంతో “జై శ్రీరామ్” నినాదాలు చేస్తూ నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే కామటిపుర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ అక్కడి నుండి పరిస్థితి మరింత తీవ్రమైంది. ఈ సందర్భంగా పోలీసు అధికారులపై రాళ్లు రువ్వి, పోలీసు వాహనాలకు నిప్పంటించారు.
ఒక పౌరుడి మోటార్‌సైకిల్‌కు నిప్పంటించారు. వస్తున్న ఒక ట్రక్కు విండ్‌షీల్డ్‌ను పగలగొట్టారు.దీంతో మూసీ నది ఒడ్డున ఉన్న రద్దీ కూడలిలో ట్రాఫిక్ ఒక్కసారిగా నిలిచిపోయింది. రాళ్ల దాడిలో నలుగురు పోలీసు అధికారులు, ఒక స్థానికుడు గాయపడినట్లు సమాచారం. ఉద్రిక్తత పెరగడంతో గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అదనపు బలగాలను రప్పించారు.
అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్, సౌత్ రేంజ్ (శాంతిభద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్, చార్మినార్, గోల్కొండ, రాజేంద్రనగర్ డీసీపీలు, టాస్క్ ఫోర్స్ మరియు ట్రాఫిక్ పోలీసులు సహా సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చివరకు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కామటిపుర పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), ప్రభుత్వ ఆస్తుల నష్టం నివారణ చట్టం (పీడీపీపీ)లోని వివిధ సెక్షన్ల కింద రెండు కేసులు నమోదు చేశారు.
మొదటి కేసు స్థానిక నివాసి పి. సాయినాథ్ ఫిర్యాదుపై నమోదు చేశారు. అతని ప్రకారం, అతను, అతని సోదరుడు ఎం. సందీప్ పురానాపుల్ దర్వాజా మీదుగా వెళ్తున్నప్పుడు, ఆలయంలో ఒక అపరిచితుడు అక్కడున్న విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని గమనించారు. ఆ వ్యక్తి ఒక దేవతా విగ్రహాన్ని తీసుకుని నేలపై విసిరాడని సాయినాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారు ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించగా, అతను గోడ దూకి పారిపోయాడు.
రెండవ ఎఫ్ఐఆర్ కామటిపుర సబ్-ఇన్స్పెక్టర్ కె. నర్సింహులు ఫిర్యాదుపై నమోదు చేశారు. పురానాపుల్ దర్వాజా ప్రాంతం సమీపంలో ఒక గుంపు సమాధులను ధ్వంసం చేస్తున్నారని రాత్రి 10:50 గంటల ప్రాంతంలో తమ స్టేషన్‌కు ఒక అత్యవసర కాల్ వచ్చిందని అధికారి తెలిపారు. అక్కడికి చేరుకోగానే, గుంపు హింసాత్మకంగా మారి రాళ్లు రువ్వింది. దీంతో చార్మినార్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగార్జునతో పాటు కొందరు అధికారులు, ప్రజలు గాయపడ్డారు. ఇప్పటివరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
మరుసటి రోజు, హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు సంఘటనా స్థలాన్ని సందర్శించి, విధ్వంసం, హింసకు పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దేవతా విగ్రహాన్ని, శివాజీ జెండాను అపవిత్రం చేశారని రామచందర్ రావు ఆరోపించారు.
ఎక్స్‌లో చేసిన ఒక పోస్ట్‌లో, ఓటు బ్యాంకు రాజకీయాల పేరుతో అధికార కాంగ్రెస్ పార్టీ మూగ ప్రేక్షకపాత్ర పోషిస్తోందని ఆయన ఆరోపించారు. “కపట లౌకికవాదులు ఈ విషయంపై మౌనం వహించినప్పటికీ, మన దేవాలయాలను పరిరక్షించడానికి బీజేపీ దృఢంగా నిలబడి, అచంచలమైన సంకల్పంతో పోరాడుతుంది,” అని ఆయన స్పష్టం చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ పురానాపుల్ దర్వాజాను సందర్శించి, అక్కడి స్థానికులతో మాట్లాడారు. హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి ఇది రెండో ప్రయత్నమని ఆయన ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ, “ఈ సంఘటన అత్యంత హేయమైనది. మతపరమైన మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. తెలంగాణలో హిందువులకు గానీ, మన దేవాలయాలకు గానీ రక్షణ లేదు,” అని ఆయన మండిపడ్డారు.
సురక్షితమైన వాతావరణం కల్పిస్తామన్న హైదరాబాద్ పోలీసుల హామీని కూడా ఆయన “బోలు వాగ్దానాలు”గా అభివర్ణించారు. “పోలీసులు అసదుద్దీన్ ఒవైసీ చేతిలో కీలుబొమ్మల్లా ఆడుతున్నారు. నాకు తెలిసినంత వరకు, కేవలం హిందువులను మాత్రమే అదుపులోకి తీసుకుంటున్నారు. ఏ ఒక్క ముస్లింను కూడా అరెస్టు చేయలేదు. ప్రస్తుతం తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంది,” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పటికీ, రాష్ట్రాన్ని నడుపుతున్నది అసదుద్దీన్ ఒవైసీనే,” అని ధ్వజమెత్తారు.

More Stories
పోచారం, కాలె యాదయ్యలకు స్పీకర్ క్లీన్ చిట్
బెంగాల్లో ఈడీ దర్యాప్తునకు ఆటంకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
వైవిధ్యాన్నే బలంగా మార్చుకొని ఎదుగుతున్నాం