విభజన అజెండా కోసం ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికలను పాకిస్థాన్ దుర్వినియోగం చేస్తోందని భారత్ మండిపడింది. ఐరాస ఛార్టర్ ప్రకారం లభించిన స్వీయ నిర్ణయ హక్కును పాక్ దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. స్వీయ నిర్ణయ హక్కును వాడుకొని బహుళత్వం కలిగిన ప్రజాస్వామిక దేశాల్లో విభజనవాదాన్ని ప్రోత్సహించేలా మాట్లాడకుండా పాక్‌ను నిరోధించాలని కోరింది.
ఈ మేరకు ఐరాసలోని భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ ఎల్డోస్ మ్యాథ్యూ పున్నూస్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. 2025లో ఐరాస కార్యకలాపాలపై సెక్రెటరీ జనరల్ విడుదల చేసిన వార్షిక నివేదికపై అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఐరాస జనరల్ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మ్యాథ్యూ పున్నూస్ ప్రసంగిస్తూ ప్రపంచ దేశాలన్నీ సంకుచిత ఆలోచనా దృక్పథం నుంచి బయటికొచ్చి మాట్లాడుతుంటే, పాక్ మాత్రమే విభజన అజెండాతో విషం కక్కుతోందని ఆయన మండిపడ్డారు.
భారత్‌లో ఒక భాగమైన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీరు గురించి మాట్లాడేందుకు ఐరాసను పాక్ వేదికగా చేసుకోవడం సరికాదని హితవు చెప్పారు. మరో దేశానికి చెందిన భూభాగం గురించి మాట్లాడే హక్కు ముమ్మాటికీ పాక్‌కు లేదని స్పష్టం చేశారు. 1948 ఏప్రిల్ 21న ఐరాస భద్రతా మండలి చేసిన తీర్మానం ప్రకారం జమ్మూకశ్మీరు నుంచి సేనలను పాక్ వెనక్కి తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
నాటి నుంచి జమ్మూకశ్మీరు ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికలలో ఓట్లు వేస్తూ, తమ ప్రతినిధులను చట్టసభలకు పంపుతున్నారని మ్యాథ్యూ పున్నూస్ తెలిపారు. ఈవిధంగా తాము భారతదేేశ పక్షమే అనే సందేశాన్ని జమ్మూకశ్మీరు ప్రజలు ఇచ్చారని స్పష్టం చేశారు. పాక్ ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తిఖార్ అహ్మద్ ఈ ఐరాస సెషన్లో జమ్మూకశ్మీరు అంశాన్ని లేవనెత్తడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
“విభజనవాద అజెండాను అన్ని వేదికల్లో ప్రమోట్ చేయడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారిపోయింది. మేం పాక్ వాదనకు కౌంటర్ ఇవ్వక తప్పదు. ఒకవేళ పాక్ నిరాధార ఆరోపణలు, అవాస్తవాలను మేం ఎప్పటికప్పుడు తిప్పి కొట్టకుంటే, అది వాస్తవ విరుద్ధ అంశాలను ఇలాగే చెబుతుంటుంది. మేం ఐరాసకు చెందిన అన్ని వేదికల్లో వాస్తవాలను తెలియజేస్తున్నాం. పాక్‌ను నిలువరించాల్సిన అవసరం ఉంది” అని మ్యాథ్యూ పున్నూస్ పేర్కొన్నారు.
“గ్లోబల్ సౌత్ దేశాల సెంటిమెంట్‌ను ఐరాస గౌరవించాలి. ఆ దిశగా నిర్దిష్ట చర్యలను చేపట్టాలి. దశాబ్దాల కిందటి సమీకరణాల ప్రకారం ప్రస్తుతం ఐరాసలో ప్రపంచ దేశాలకు ప్రాధాన్యతలు ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలి. తాజా సమీకరణాల ప్రకారం ప్రపంచ దేశాలకు ప్రాధాన్యతలు దక్కాలి. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ పక్ష సంస్థ ఐరాస ప్రస్తుత సందర్భానికి అనుగుణంగా మారాలి” అని సూచించారు.

More Stories
ఎట్టకేలకు నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ట్రంప్
ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు నేటి నుంచే
డెన్మార్క్‌తోనే కొనసాగుతాం.. గ్రీన్లాండ్ ప్రధాని స్పష్టం