తుది దశకు భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం

తుది దశకు భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం

భారత్, అమెరికా మధ్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మొదటి విడత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) దాదాపు తుది దశకు చేరుకుందని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. అయితే ఒప్పందం ప్రకటన ఎప్పుడు ఉంటుందనే విషయంలో కచ్చితమైన గడువు చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు. 

గురువారం భారత్- అమెరికా ట్రేడ్ డీల్‌పై విలేకరులు అడిగిన ప్రశ్నలకు రాజేశ్ అగర్వాల్ సమాధానంగా “భారత్–అమెరికా బృందాలు ప్రస్తుతం అన్ని పెండింగ్ అంశాలపై వర్చువల్‌గా చర్చలు జరపుతున్నాయి. ఈ చర్చలు ఎప్పుడూ మధ్యలో ఆగలేదని, రెండు దేశాలు నిరంతరం సంప్రదింపుల్లోనే ఉన్నాయి. ఈ వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే దశకు చేరుకుంద” అని చెప్పారు. 

ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నామని భావించినప్పుడు, సరైన సమయంలో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.   అమెరికా భారీ సుంకాల ఉన్నప్పటికీ భారత ఎగుమతులు ఇంకా సానుకూల ధోరణిలోనే ఉన్నాయని అగర్వాల్ పేర్కొన్నారు. నెలవారీ ఎగుమతులు దాదాపు 7 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయని చెప్పారు. 

అయితే సుంకాలు తక్కువగా ఉన్న రంగాలపై తాము ఎక్కువ దృష్టి పెడుతున్నామని, సుంకాలు ఎక్కువగా ఉన్న చోట కూడా మన పరిశ్రమలు పటిష్టంగా ఉండి ఎగుమతులను కాపాడుకుంటున్నట్లు చెప్పారు. భారత ఇంధన దిగుమతుల గురించి కూడా మాట్లాడుతూ భారత్ తన సాంప్రదాయ సరఫరాదారుల నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, అయితే ఈ మధ్య కాలంలో అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా పెంచిందని ఆయన తెలిపారు. 

ఇంధన వాణిజ్యం అనేది అమెరికాతో జరుగుతున్న చర్చల్లో ప్రధానాంశంగా ఉంది. భారత్ తన ఇంధన అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో ఇంధన డీల్‌ను తమతో ఎక్కువ చేసుకోవాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో ఇరాన్‌తో వాణిజ్య పరంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఇరాన్‌తో భారత్ వాణిజ్యం చాలా పరిమితంగా ఉందని చెప్పారు. అలాగే కెనడాతో వాణిజ్య  చర్చలను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ఒప్పందం కోసం విధివిధానాలను ఖరారు చేస్తున్నామని తెలిపారు.