ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు నేటి నుంచే

ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు నేటి నుంచే

* ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరిక

రోజురోజుకు ఇరాన్‌లో ఆందోళ‌న‌లు తీవ్ర‌మ‌వుతున్నాయి. దాంతో. ప్ర‌భుత్వం  ఇంట‌ర్నెట్ సేవలు నిలిపివేశారు. ఫోన్ సేవ‌లు కూడా దాదాపు స్తంభించిపోయాయి. ఈ నేప‌థ్యంలో భార‌త విద్యార్థులు అక్క‌డే ఉండ‌డం శ్రేయ‌స్క‌రం కాద‌ని భావించిన ప్ర‌భుత్వం వారిని స్వదేశం తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు టెహ్రాన్‌లోని భార‌త దౌత్య కార్యాలయం అక్క‌డి భార‌త విద్యార్థులను సంప్ర‌దించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. తొలి బృందాన్ని శుక్రవారం భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం.

ప్రయాణానికి అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని టెహ్రాన్‌లోని భారత్‌ ఎంబసీ అధికారులు, విద్యార్థులను కోరినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ నుంచి భారత్‌కు తిరిగొచ్చేందుకు ఆసక్తి చూపిన వారి వివరాలను టెహ్రాన్‌లోని భారత్ ఎంబసీ సేకరిస్తోందని విదేశాంగశాఖ తెలిపింది. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేత కారణంగా భారతీయులను సంప్రదించేందుకు ఇబ్బందిగా ఉందని పేర్కొంది. అయితే ఇరాన్‌లో దాదాపు 10వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా.

బుధవారం టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు సహా భారతీయ పౌరులు అందరూ అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్‌ను విడిచిపెట్టాలని కోరింది. భారతీయ పౌరులు అందరితో పాటు భారత సంతతికి చెందిన వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిరసనలు లేదా ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, రాయబార కార్యాలయంతో సంబంధాలు కొనసాగించాలని కూడా మిషన్ కోరింది.  ….

మరోవంక, హింసాత్మక నిరసనల నేపథ్యంలోవాణిజ్య విమానాల రాకపోకలకు ఇరాన్‌ గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి.

”ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇరాన్‌ మీదుగా వెళ్లాల్సిన కొన్ని విమాన సర్వీసులను దారి మళ్లిస్తున్నాం. ప్రత్యామ్నాయ మార్గాలు సాధ్యం కాని కొన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నాం. ప్రయాణికులు అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలి. ఈ అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం” అని ఎయిరిండియా సోషల్‌ మీడియా ఖాతాలో వెల్లడించింది.

మరో విమానయాన సంస్థ ఇండిగో కూడా ఇరాన్‌ గగనతలం మూసివేయడంతో కొన్ని అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడిందని తెలిపింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నామని వెల్లడించింది. 

మరోవంక, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇజ్రాయెల్ అధికారులు, హోం ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. 
అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో భారత పౌరులు రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్లు +972-54-7520711, +972-54-3278392ను సంప్రదించాలని సూచించింది. లేదంటే consl.telaviv@mea.gov.in మెయిల్ ద్వారా సంప్రదించాలని పేర్కొంది.