మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

* ముంబైపై పాతికేళ్ల పట్టును కోల్పోయిన ఠాక్రే ఫ్యామిలీ

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఆసియాలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై గత 25 ఏళ్లుగా ఉన్న ఠాక్రేల పట్టును బీజేపీ-షిండే సేన కూటమి బద్దలు కొట్టింది. బీఎంసీ పరిధిలో మొత్తం 227 స్థానాలు ఉండగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి 114 స్థానాలు అవసరం కాగా మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.
బీజేపీ, షిండే శివసేన నేతృత్వంలోని మహాయుతి కూటమి 116 స్థానాలు దక్కించుకుంది. అందులో బీజేపీ 88 సీట్లు సాధించగా, షిండే సేన 28 స్థానాల్లో విజయం సాధించింది. 
ఇక ఠాక్రే కూటమికి 82 సీట్లు రాగా,  అందులో ఉద్ధవ్ శివసేన 74 స్థానాల్లో, రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన 8 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 23 సీట్లను సాధించుకుంది. శరద్ పవార్ ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, ఎంఐఎం పార్టీలు కలిసి 6 సీట్లను సాధించుకున్నాయి.
 
ముంబై మాత్రమే కాకుండా మహారాష్ట్రలోని మిగిలిన 28 మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా బీజేపీ కూటమి ఘనవిజయం సాధించింది. మొత్తం 29 కార్పొరేషన్లలోని 2,869 సీట్లలో బీజేపీ కూటమి సుమారు 1,517 పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు పూణే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో (80 సీట్లు) దూసుకుపోతోంది. అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేసినా ఫలితం లేకపోయింది. నాగపూర్, కొల్హాపూర్, భివాండి ప్రాంతాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకుంది.

మధ్యలో చిన్న విరామం మినహా 1985 నుంచి బీఎంసీపై ఉమ్మడి శివసేన పార్టీ పట్టును కొనసాగిస్తూ వస్తోంది. తాజా ఓటమితో ఠాక్రే కుటుంబానికి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దాదాపు రూ. 74,400 కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన బీఎంసీ ఇప్పుడు బీజేపీ-షిండే శివసేన చేతుల్లోకి వెళ్లనుంది. జనవరి 15వ తేదీన జరిగిన పోలింగ్‌లో 52.94 శాతం ఓటింగ్ నమోదైంది.
 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ, హిందుత్వను అభివృద్ధికి సమానంగా అభివర్ణించారు. తన ప్రసంగంలో, 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల బీజేపీ+ విజయం సాధించిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి రాజకీయాలను ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన తెలిపారు. 

 
మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ-శివసేన విజయం సాధించనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేలకు అభినందనలు తెలిపారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో మహారాష్ట్ర అభివృద్ధి ప్రస్థానం మరింత బలం పుంజుకుంటుందని నేను విశ్వసిస్తున్నాను,” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.