మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ.. ఈడీకి వ్యతిరేక పిటిషన్ కొట్టివేత

మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ.. ఈడీకి వ్యతిరేక పిటిషన్ కొట్టివేత

ఐ ప్యాక్‌ డైరెక్టర్ ప్రతీక్ జైన్‌ కార్యాలయం, నివాసంలో ఈడీ దాడులకు సంబంధించి టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. జనవరి 8న ఐ ప్యాక్‌ కార్యాలయం, ప్రతీక్‌ జైన్‌ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన సమయంలో, వ్యక్తిగత, రాజకీయ సమాచారాన్ని స్వాధీనం చేసుకుని ఉండవచ్చునని టీఎంసీ అనుమానం వ్యక్తం చేసింది. 

ఈ నేపథ్యంలో, ఆ డేటాను సంరక్షించాలంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వాలని టీఎంసీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు, ఈ రెండు ప్రదేశాల నుంచి ఏమీ స్వాధీనం చేసుకోలేదని కోర్టుకు స్పష్టం చేశారు. ఈడీ స్వాధీనం చేసుకున్నదేమైనా ఉంటే, అది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకెళ్లారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 

ఈ నేపథ్యంలో ఈడీ, కేంద్ర ప్రభుత్వం తరఫున చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ సువ్రా ఘోశ్, ఈ వ్యవహారంలో తదుపరి విచారించాల్సిన అవసరం ఏమీ లేదని వ్యాఖ్యానిస్తూ, టీఎంసీ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అంశాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. జనవరి 8న సాల్ట్‌లేక్‌లోని రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ కార్యాలయం, దక్షిణ కోల్‌కతాలోని లౌడన్‌ స్ట్రీట్‌లో ఉన్న ప్రతీక్‌ జైన్‌ నివాసానికి మమతా బెనర్జీ వెళ్లిన ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ఈడీ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది.

ఈడీ ఇప్పటికే దాదాపు ఇదే అంశాలపై సుప్రీంకోర్టులో రెండు ప్రత్యేక పిటిషన్లు దాఖలు చేసినందున, దానిపై మళ్లీ విచారణ చేపట్టడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ, అదే అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉండగా, హైకోర్టు జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు.

మరోవైపు, టీఎంసీ తరఫు న్యాయవాది మేనకా గురుస్వామి, రాజకీయ పార్టీలకూ గోప్యత హక్కు ఉందని, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇప్పటికే స్పష్టం చేసిందని కోర్టుకు వివరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీకి సంబంధించిన సున్నితమైన డేటాను స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయంటూ ఆమె ఆరోపించారు.