‘జన నాయగన్’ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

‘జన నాయగన్’ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ నటించిన తాజా చిత్రం జన నాయగన్ బృందానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సెన్సార్ సర్టిఫికెట్‌ జారీకి స్టే విధించిన మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వుల్ని సవాల్‌ చేస్తూ సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ ఆ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించాలని ఆదేశించింది.

ఈనెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు సుప్రీంకోర్టు గురువారం నాడు సూచించింది. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఆలస్యమైతే సినిమాకు అన్యాయం జరుగుతుందని నిర్మాతల తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలుపగా, దీనిపై కచ్చితంగా జనవరి 20వ తేదీన తీర్పు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

గత డిసెంబరులో సెన్సార్‌ కోసం జన నాయగన్ సినిమాను పంపగా అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించాలని, కొన్ని సంభాషణలు మ్యూట్‌ చేయాలని సూచించినట్లు సమాచారం. ఆ మేరకు మార్పులు చేసిన నిర్మాణ సంస్థ మళ్లీ సెన్సార్‌కు పంపగా బోర్డు నుంచి స్పందన రాలేదు.  ఈ నేపథ్యంలో కేవీఎన్‌ ప్రొడక్షన్‌ తరఫున మద్రాసు హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలైంది.

తొలుత యూ/ఏ సర్టిఫికేషన్‌కు సిఫార్సు చేసిన సెన్సార్‌ బోర్డు ఆ తర్వాత సినిమాను రివ్యూ కమిటీకి పంపిందని నిర్మాణ సంస్థ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. దీంతో జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు వెలువరిస్తూ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. ముందుగా ఇస్తామన్న యూ/ఏ సర్టిఫికెట్‌ తక్షణమే ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 

అనంతరం సింగిల్‌ జడ్జి తీర్పుపై సెన్సార్‌ బోర్డు మద్రాసు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం ముందు అత్యవసర విచారణ కోసం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.ఈ అప్పీల్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. దీంతో కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. కానీ సినిమా విడుదల విషయంలో జోక్యానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం మద్రాసు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది.