ఎన్టీవీ జర్నలిస్టుల రిమాండ్ తిరస్కరించిన మెజిస్ట్రేట్

ఎన్టీవీ జర్నలిస్టుల రిమాండ్ తిరస్కరించిన మెజిస్ట్రేట్
ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులో పోలీసులకు కోర్టులో చుక్కెదురైంది. ఓ మంత్రితో పాటు ఐఏఎస్‌లను లక్ష్యంగా చేసుకుని కథనాలు ప్రసారం చేశారనే ఆరోపణలతో ఎన్‌టీవీ ఇన్‌పుట్‌ ఎడిటర్‌ దొంతు రమేష్‌, జర్నలిస్టులు సుధీర్‌ బాబు, పరిపూర్ణచారిలను మంగళవారం అర్థరాత్రి పోలీసులు అరెస్ట్‌ చేసిన తీరుపై విమర్శలు చెలరేగాయి.  మంగళవారం రాత్రి వీరిని హైదరాబాద్‌ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇద్దరిని ఇంటిదగ్గర, ఒకరిని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అరెస్ట్‌ చేశారు. ముగ్గురిని హైదరాబాద్‌లోని నేర పరిశోధక విభాగానికి (సిసిఎస్‌) తరలించి సిట్‌ అధికారులు మూడు గంటలపాటు విచారించారు. అనంతరం కేసులో నిందితుడిగా ఉన్న పరిపూర్ణాచారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మరో ఇద్దరిని సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించి, సిసిఎస్‌కు తరలించారు.
 
అయితే, వారిని గురువారం తెల్లవారు జామున మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్‌ల రిమాండ్ తిరస్కరించి, 14వ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేశారు. టివి ఛానల్‌ బాధ్యులతోపాటు ఏడు యూట్యూబ్‌ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐఎఎస్‌ అధికారుల సంఘం ఇటు ప్రభుత్వంతోపాటు అటు రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేసింది. 
 
డిజిపి శివధర్‌రెడ్డి, నగర పోలీస్‌ కమిషనర్‌ విసి సజ్జనార్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేశారు.  మంగళవారం రాత్రి యాంకర్​ దేవి నుంచి ఛానెల్​ కార్యాలయంలో సిట్​ స్టేట్​మెంట్​ తీసుకుంది. ఎన్టీవీ సీఈవో రాజశేఖర్​ నివాసానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. పలు ఛానెళ్లు, యూట్యూబ్ ప్రతినిధులకు ఫోన్లు చేసినా కూడా స్పందించలేదని సమాచారం. 
 
ఈ అరెస్టుల వ్యవహారం కొనసాగుతుండగానే సీసీఎస్ ​ ఏసీపీ గురు రాఘవేంద్ర నేతృత్వంలోని పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం జూబ్లీహిల్స్​లోని ఎన్టీవీ కార్యాలయానికి వెళ్లడంతో కొద్ది సమయం హైడ్రామా జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఆఫీస్​కి వెళ్లిన పోలీసుల్ని లోపలికి పంపకుండా సెక్యూరిటీ సిబ్బంది గేటు దగ్గరే అడ్డుకున్నారు.
 
ఎన్‌టివి కార్యాలయంలో సిట్‌ ప్రత్యేక బృందం సోదాలు నిర్వహించింది. ఈ ప్రసారం కోసం వాడిన కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌, సిపియును స్వాధీనం చేసుకుంది. సోదా చేయడానికి సెర్చ్‌వారెంట్‌ మీ దగ్గర ఉందా? అంటూ సిట్‌ అధికారులను నిలదీశారు. అందుకు మౌనం వహించిన అధికారులు ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. బ్యాంకాక్‌కు పారిపోతుంటే వారిని అరెస్ట్‌ చేశామని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ విసి సజ్జనార్‌ తెలిపారు. ముందుగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవొచ్చు కదా అని విలేకర్లు ప్రశ్నించగా, తాము విచారణకు రమ్మని చెప్పామని, తర్వాత వారు మొబైల్‌ ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారనీ, ఇక నోటీసులు ఇచ్చేది ఏమిటని ఎదురు ప్రశ్నించారు. బ్యాంకాక్‌కు పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారని, ఆ ప్రయత్నంలో ఉండగానే తాము పట్టుకున్నామని తెలిపారు.

“విచారణలో భాగంగా పిలిచినప్పుడు రావాలి కదా. ఒక జర్నలిస్టు రాత్రి పారిపోయేందుకు ప్రయత్నించారు. సాయంత్రం 5.30 గంటలకు బ్యాంకాక్​కు టికెట్​ బుక్​ చేసుకుని వెళ్తున్నారు. అందుకే ఇళ్లల్లో సోదాలకు వెళ్లాం. ఛానెల్ సీఈవో ఎక్కడున్నారు? తప్పు చేయకపోతే ఎందుకు భయం? విచారణలో భాగంగా అందరినీ పిలుస్తాం. ఎక్కడున్నా పట్టుకొచ్చి చట్టం ముందు ప్రవేశపెడతాం” అని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు.