ఎగుమతుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానం

ఎగుమతుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానం
ఎగుమతుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానంలో నిలిచింది. ఈ మేరకు బుధవారం నీతి ఆయోగ్‌ 2024 ఎగుమతుల నివేదికను విడుదల చేసింది. అందులో మొదటి స్థానంలో 68.01 స్కోర్‌తో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది.  64.41 స్కోర్‌తో తమిళనాడు రెండో స్థానంలోనూ, 64.02 స్కోర్‌తో గుజరాత్‌, 62.09 స్కోర్‌తో ఉత్తరప్రదేశ్‌తో మూడు, నాలుగో స్థానాల్లోనూ నిలిచాయి. 60.65 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానంలో నిలిచింది. 57.14 స్కోర్‌తో తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
 
2024లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రూ.1.65 లక్షల కోట్లు ఎగుమతులు జరిగాయి. 60.65 స్కోర్‌తో ఐదో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి యుఎఇ (21.96 శాతం), చైనా (6.95 శాతం), సింగపూర్‌ (5.56 శాతం), ఇండోనేషియా (4.35 శాతం), సౌదీ అరేబియా (3.07 శాతం) ఎగుమతులు జరిగాయి. సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్‌, హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ రంగాల నుంచి ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి. 
 
ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌, సెమీకండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌, మెడికల్‌ డివైజ్‌ రంగాల్లో ఇప్పుడిప్పుడు ఎగుమతుల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. దేశంలోని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 60 శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచే జరుగుతాయి. 2023-24లో ఎపి జిఎస్‌డిపి రూ.14.4 లక్షల కోట్లు చేరిందని, వృద్ధి రేటు సుమారుగా 5 శాతం నమోదైంది. 
 
2023-24లో రాష్ట్రం మొత్తం రూ.1.6 లక్షల కోట్ల విలువైన ఎగుమతులను రికార్డుస్థాయిలో నమోదు చేసింది. సముద్ర ఉత్పత్తులు రూ.24,679 కోట్ల ఎగుమతులు జరిగాయి. సముద్ర ఉత్పత్తులు నెల్లూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి ఎగుమతులు జరిగాయి. ఫార్మాస్యూటికల్స్‌ రూ.18,410 కోట్లు ఎగుమతులు జరిగాయని, విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ఈ ఎగుమతులు జరిగాయని ఆ నివేదిక పేర్కొంది.
 
ఆంధ్రప్రదేశ్‌ ఎగుమతులు 2023లో 4.4 శాతం ఉంటే, 2024లో 4.5 శాతానికి పెరిగాయి. రొయ్యలు రూ.19,776 కోట్లు, ఔషధాలు రూ.10,875 కోట్లు, లైట్‌ – వెసెల్స్‌, ఫైర్‌ ఫ్లోట్లు తదితర ఉత్పత్తులు రూ.9,028 కోట్లు, పొగాకు రూ.7,045 కోట్లు, బియ్యం రూ.6,412 కోట్లు, షుగర్‌ రూ.5,727 కోట్లు, మిరియాలు, క్యాప్సికం రూ.5,582 కోట్లు, మోటర్‌ కార్స్‌ రూ.5,518, ఫెర్రో మిశ్రమాలు రూ.5,480 కోట్లు, పెట్రోలియం ఆయిల్స్‌ రూ.5,238 కోట్లు ఎగుమతవుతున్నాయి. 
 
కాకినాడ నుంచి వంట నూనెలు, కెమికల్‌ ఇండిస్టీ, పెట్రోకెమికల్స్‌, విశాఖపట్నం నుంచి ఫార్మాస్యూటికల్స్‌, మెడికల్‌ పరికరాలు, ఇంజనీరింగ్‌, పారిశ్రామిక ఉత్పత్తులు, ప్రకాశం నుంచి కెమికల్‌ ఇండిస్టీ, ఇండిస్టియల్‌ పరికరాలు, అనంతపురం నుంచి ఆటోమొబైల్స్‌ ఎగుమతవుతున్నాయి.