ప్రస్తుతం డెన్మార్క్ రాజ్యంలో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్ అలాగే కొనసాగాలని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. బుధవారం వాషింగ్టన్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో డానిష్, గ్రీన్‌లాండ్ విదేశాంగ మంత్రులు సమావేశం కావడానికి ముందు గ్రీన్‌లాండ్ ప్రధాని నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నయానో భయానో గ్రీన్‌లాండ్‌ని స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో ప్రస్తుత పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని నీల్సన్ తెలిపారు. నీల్సన్ తాజా వ్యాఖ్యల గురించి విలేకరులు ట్రంప్‌ని ప్రశ్నించగా ఆ దేశానికి ఇది పెద్ద సమస్యను సృష్టించగలదని హెచ్చరించారు. వారితో తాను ఏకీభవించనని, ఆయన(నీల్సన్) గురించి తనకు ఏమీ తెలియదని, అయితే ఆయన పెద్ద సమస్యను ఎదుర్కోక తప్పదని ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశ భద్రత కోసం గ్రీన్‌లాండ్ చాలా అవసరమని ట్రంప్ తాజా పోస్ట్‌లో చెప్పారు. తాము నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్ కోసం గ్రీన్‌లాండ్ అత్యంత కీలకమైనదని తెలిపారు.
అమెరికా చేతిలో గ్రీన్‌లాండ్ ఉంటే, నాటో మరింత పటిష్టం, బలోపేతం అవతుందని తెలిపారు. డానిష్ డిఫెన్స్ మినిస్టర్ ట్రోయెల్స్ లుండ్ పౌల్సెన్ గ్రీన్‌లాండ్‌పై అమెరికా ఆందోళనను తగ్గించేందుకు ప్రయత్నించారు. డెన్మార్క్ తన సైన్యాన్ని గ్రీన్‌లాండ్‌లో పెంచుతుందని, ఈ విషయంలో నాటోతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. మల్టీ లేయర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను నిర్మించడానికి నాటో నాయకత్వం వహించాలని ట్రంప్ అన్నారు. “మనం చేయకపోతే, రష్యా లేదా చైనా చేస్తుంది. అలా జరగడానికి వీల్లేదు” అని తెలిపారు.
మరోవంక, గ్రీన్‌ల్యాండ్‌కి మద్దతుగా ఫిబ్రవరి 6న అక్కడ తమ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించనున్నామని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్ వెల్లడించారు. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా నుండి పదేపదే వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో ఆ దేశానికి మద్దతును ప్రకటించేందుకు ఇది ఒక నిర్దిష్ట చర్య కానుందని తెలిపారు. అమెరికా పాలనకు, స్వాధీనంలో ఉండేందుకు, విలీనం కావడానికి గ్రీన్‌ల్యాండ్ ఇష్టపడటం లేదని గుర్తు చేశారు.
నాటో, యూరోపియన్ యూనియన్‌లో భాగమైన డెన్మార్క్ పరిధిలోనే ఉండాలని ఈ దేశం ఎంచుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అమెరికా వ్యాఖ్యలు అసంబద్ధమైనవి అని పేర్కొంటూ ఒక నాటో సభ్యుడు మరోకరిపై దాడి చేయడంలో అర్థం లేదని హితవు చెప్పారు. ఇటువంటి చర్య అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమని హెచ్చరించారు.

More Stories
ఎన్టీవీ జర్నలిస్టుల రిమాండ్ తిరస్కరించిన మెజిస్ట్రేట్
ఇరాన్ హెచ్చరికలతో అమెరికా వెనకడుగు!
ఉత్తరాది మహిళలపై డీఎంకే ఎంపీ మారన్ వాఖ్యల దుమారం