బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భగా తొలుత ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రధాని నిర్వహించారు. అనంతరం ఆయనే స్వయంగా పొంగల్ వండారు. ప్రధాని మోదీ గోవులకు పూజ చేశారు. పొంగల్ వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.
పొంగల్ పండుగ మన జీవితానికి ఆనందకర అనుభవాన్ని ప్రసాదిస్తుందని మోదీ అన్నారు. అన్నదాతల శ్రమను గుర్తిస్తూ, ప్రకృతి మాతకు, పుడమి తల్లికి, సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుకునే అపురూప సందర్భం పొంగల్ అని ప్రధాని కొనియాడారు. ప్రకృతి, కుటుంబం, సమాజం మధ్య సమతూకాన్ని పాటించే బాటను ఈ పండుగ చూపిస్తుందని, నేల సారాన్ని కాపాడటం, జల పరిరక్షణ, భవిష్యత్ తరాల కోసం వనరుల సద్వినియోగం అవసరమని మోదీ తెలిపారు.
“తమిళ సంస్కృతి కేవలం తమిళనాడుకు పరిమితం కాదు. ఇది యావత్ భారతదేశ ఉమ్మడి సంస్కృతి. ఇతర ప్రపంచ దేశాల్లోనూ దాని ఉనికి ఉంది. ప్రపంచ మానవత్వ వారసత్వంతోనూ తమిళ సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది. గతేడాది కూడా తమిళ సంస్కృతితో ముడిపడిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే గొప్ప అవకాశం నాకు లభించింది” అని ప్రధాని చెప్పారు.
“దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు పొంగల్‌తో పాటు లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ్ బిహు వంటి పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. భారత్‌లోని, విదేశాల్లో ఉన్న తమిళ సోదరులు, సోదరీమణులకు నా తరఫున హృదయపూర్వక పొంగల్ శుభాకాంక్షలు. ఇదొక కుటుంబపరమైన పండుగ. వికాసం, కృతజ్ఞత, ఐకమత్యం అనే భావనలను కుటుంబాలు సంతోషంగా వ్యక్తపర్చడానికి పొంగల్ వేడుక సరైన సందర్భం” అని ప్రధాని మోదీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. పంట చేతికొచ్చే సమయంలో జరిగే ఈ పండుగ భారతదేశ సాంస్కృతిక సుసంపన్నతను అద్దం పడుతుందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్న రకాలుగా స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా సంక్రాంతి వేడుకలు జరుగుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరికీ సంతోషం, వికాసం, ఆరోగ్యాలను ప్రసాదించాలని ఈసందర్భంగా సూర్య భగవానుడిని తాను ప్రార్ధిస్తున్నట్లు మోదీ తెలిపారు.

More Stories
మహిళా ఐఏఎస్‌పై అసభ్య కథనాలు.. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్
మరోసారి విజయ్‌కు సీబీఐ సమన్లు
పేరు ప్రజాస్వామ్యం: సాగుతున్నది వారసత్వాల యుద్ధం