పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే సైనిక చర్య తప్పదు

పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే సైనిక చర్య తప్పదు
ఆపరేషన్ సింధూర్ 2 ఇప్పుడూ కొనసాగుతోందని, పాకిస్తాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా సరే సైనిక చర్యకు దిగుతామని భారత ఆర్మీ చీఫ్ భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ఎటువంటి తప్పిదానికి పాల్పడినా ధీటుగా బదులిస్తామని ఆయన హెచ్చరించారు.  పాకిస్తాన్‌లో ఎనిమిది ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని, వాటిల్లో ఎల్‌ఓసీ, మరో రెండు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్నాయని తెలిపారు. వీటిద్వారా ఎటువంటి చర్యలకు పాల్పడినా పాకిస్తాన్ కు మరోసారి పరాభం తప్పదనీ తేల్చి చెప్పారు. 
పాకిస్తాన్ తో యుద్ధానికి శ్రీకారం చుట్టిన గత ఏడాది మే 10వ తేదీ నుండి ఇఫ్పటివరకు 31మంది పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులను హతమార్చామని పేర్కొన్నారు. వీరిలో 65 శాతం మంది పాకిస్తాన్ సంతతికి చెందినవారేనని తేల్చి చెప్పారు.  వీరిలో పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను ఆపరేషన్ మహాదేవ్‌ సందర్భంగా కాల్చి చంపినట్లు వెల్లడించారు.గత ఏడాది మే 10 నుండి వెస్ట్రన్ ఫ్రంట్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వెంబడి పరిస్థితి సమస్యాత్మకం, సున్నితంగానే ఉందని చెప్పారు. 
భద్రత బలగాలు ఎప్పటికప్పుడు కూంబింగ్ నిర్వహిస్తోన్నాయని, దీనివల్ల సరిహద్దు గ్రామాల్లో చెలరేగిన ఉద్రిక్త వాతావరణం నియంత్రణలో ఉందని స్పష్టం చేశారు.  పహల్గాం ఉగ్రదాడి అనంతరం, అత్యున్నత స్థాయిలో తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. మే 7న కేవలం 22 నిమిషాల్లో ప్రారంభమైన ఆపరేషన్, మే 10 వరకు 88 గంటల పాటు సాగిందని వివరించారు. 
 
“ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, లోతైన లక్ష్యాలపై దాడులు, శత్రు దేశాల అణు బెదిరింపుల ప్రచారాన్ని ఖండించడం వంటి కీలక విజయాలు సాధించాం. మొత్తం 9 లక్ష్యాల్లో ఏడింటిని భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. అనంతరం పాకిస్థాన్ నుంచి వచ్చిన చర్యలకు సమతుల్యమైన ప్రతిస్పందన ఇవ్వడంలో సైన్యం కీలక పాత్ర పోషించింది ‘ అని జనరల్ ద్వివేది తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ లో క్రియాశీలంగా ఉన్న స్థానిక ఉగ్రవాదుల సంఖ్య చాలావరకు తగ్గిందని, దాదాపుగా సింగిల్ డిజిట్‌కు చేరిందని తెలిపారు. 2025లో జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఇద్దరు స్థానికులు మాత్రమే ఉగ్రవాద సంస్థల్లో చేరారని ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. అభివృద్ధి కార్యకలాపాలు, పర్యాటక రంగం పునరుద్ధరణ వంటి చర్యల వల్ల ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయని, అమర్‌నాథ్ యాత్రలో అయిదేళ్ల సగటు కంటే అధికంగా నాలుగు లక్షలకు పైగా యాత్రికులు పాల్గొన్నారని గుర్తు చేశారు.

సంప్రదాయ యుద్ధ కార్యకలాపాలకు అవకాశం తగ్గిపోయి, నేరుగా అణు రంగంలోకి వెళ్తామని అందరూ భావించారని, దీనికి భిన్నంగా వ్యవహరించామని థెయ్ల్పరు. యుద్ధ రీతుల్లో సంప్రదాయ కార్యకలాపాల పరిధిని మరింత విస్తరించుకున్నామని వివరించారు. పాకిస్తాన్‌ రాజకీయ నాయకులు, అక్కడి ప్రజలే దీని గురించి మాట్లాడారని, మిలటరీ నుండి అలాంటి సూచనలేవీ తనకు అందలేదని స్పష్టం చేశారు. 

 
యుద్ధం కొనసాగిన ఆ 88 గంటల్లో సంప్రదాయ యుద్ధ కార్యకలాపాల పరిధిని విస్తరించడానికి అసాధారణంగా సైన్యాన్ని సమీకరించుకున్నామని తెలిపారు. పాకిస్తాన్ ఏ మాత్రం తప్పు చేసినా, మళ్లీ ఆపరేషన్ ప్రారంభించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.