బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతలతో చైనా కమ్యూనిస్టు నేతల భేటీలు

బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతలతో చైనా కమ్యూనిస్టు నేతల భేటీలు
భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నాయకత్వంతో సమావేశమైన ఒక రోజు తర్వాత, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం ఢిల్లీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలేను కలిసింది. చైనా ప్రతినిధి బృందం ఉదయం 11 గంటలకు ఆర్‌ఎస్‌ఎస్ రెండో అత్యున్నత నాయకుడిని ఆయన కార్యాలయంలో కలిసింది. ఈ సమావేశం సుమారు గంటసేపు జరిగింది.
 
“సీపీసీ విదేశాంగ మంత్రిత్వ శాఖను ఒక సమావేశం కోసం అభ్యర్థించగా, ఆర్ఎస్ఎస్ అందుకు అంగీకరించింది. తన శతజయంతి సంవత్సరంలో, ఆర్‌ఎస్‌ఎస్ సమాజం, రాజకీయాలు, దౌత్య రంగాలలోని అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇది స్థూలంగా ఒక మర్యాదపూర్వక భేటీ,” అని ఒక సంఘ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. సీపీసీ ప్రతినిధి బృందం రాజధాని నగర నడిబొడ్డున కొత్తగా నిర్మించిన ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం కేశవ్ కుంజ్ ప్రాంగణాన్ని కూడా సందర్శించింది.
 
చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయ విభాగం ఉపాధ్యక్షురాలు సున్ హైయాన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం సోమవారం బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఒక రోజు తర్వాత ఈ భేటీ జరిగింది.  బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం “బీజేపీ,  సీపీసీ మధ్య అంతర్-పార్టీ సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి గల మార్గాలపై” సుదీర్ఘంగా చర్చించింది.
 
కాగా, చారిత్రాత్మకంగా, బీజేపీ ,  సీపీసీ 2000వ దశకం చివరి నుండి సంబంధాలను కొనసాగిస్తున్నాయి. పలు బీజేపీ ప్రతినిధి బృందాలు సీనియర్ చైనా నాయకులను కలవడానికి బీజింగ్‌ను సందర్శించాయి. అయితే, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి 2020లో జరిగిన గాల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసిన తర్వాత జరిగిన మొదటి సమావేశం ఇదే. 
 
చైనా అధికార పార్టీ సభ్యులతో బీజేపీ సభ్యుల సమావేశం ఆరేళ్ల తర్వాత జరిగింది. 2019లో, అరుణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ నాయకుల ప్రతినిధి బృందం చైనాను సందర్శించింది. జనవరి 2011లో, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, పార్టీ ప్రతినిధి బృందం చైనాకు వెళ్లింది.
 
సోమవారం బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ప్రతినిధి బృందంలో భారతదేశంలో చైనా రాయబారి జు ఫెయ్‌హాంగ్ కూడా ఉన్నారు. గాల్విన్ లోయ ఘర్షణల తర్వాత గత ఐదేళ్లుగా భారత్- చైనా సంబంధాలలో ప్రతిష్టంభన ఏర్పడిన తర్వాత ఈ మధ్యనే సాధారణ పరిస్థితులకు చేరుకొంటున్న సందర్భంలో ఈ భేటీలకు ప్రాముఖ్యత పెరిగింది.  ఇటీవలి సంవత్సరాలలో ఆర్‌ఎస్‌ఎస్, చైనా ప్రతినిధుల మధ్య పరిమిత సంబంధాల దృష్ట్యా ఈ సమావేశం ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది.
 
ముఖ్యంగా, గత సంవత్సరం ఆగస్టులో ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ ప్రసంగాల పరంపర సందర్భంగా, ఇతర అనేక దేశాల ప్రతినిధులు హాజరైనప్పటికీ, చైనా దౌత్యవేత్తలను ఆహ్వానించలేదు. అంతకు కొద్దీ రోజుల ముందే ఆపరేషన్ సిందూర్‌ జరగడంతో పాకిస్తాన్ లేదా చైనా ప్రతినిధులను ఆహ్వానించలేదు.