ఇకపై కుక్కల దాడిలో గాయపడిన లేదా మరణించిన వారి కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీధి కుక్కల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది.
గత ఐదేళ్లుగా వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి ఉన్న నిబంధనలను రాష్ట్రాలు సరిగా అమలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్లు అభిప్రాయపడింది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. అదే విధంగా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి శునకాలపై ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోమని సూచించింది. రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కల సమస్య భావోద్వేగభరిత అంశమని తెలిపింది.
కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని స్పష్టం చేసింది. మరోవైపు, వ్యవస్థీకృత ప్రాంతాలు, రోడ్లపై సంచరించే జంతువులను తొలగించాలన్న కోర్టు ఉత్తర్వును సవరించాలని కోరుతూ దాఖలైన అనేక పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. గుజరాత్‌కు చెందిన ఒక న్యాయవాదిని పార్కులో కుక్క కరిచిందని, దాన్ని పట్టుకోవడానికి అధికారులు వెళ్లినప్పుడు జంతు ప్రేమికులు వారిపై దాడి చేశారని న్యాయస్థానం పేర్కొంది.
కుక్క కాటు ఘటనలపై విచారణ కోర్టు ప్రక్రియలా కొనసాగడం లేదని, కోర్టు ఒక ప్రజా వేదికలా మారిపోయిందని జస్టిస్ విక్రమ్ నాథ్ వ్యాఖ్యానించారు. “కుక్కకాటు ఘటనల నివారణకు రాష్ట్రాలు, కేంద్రపాలి ప్రాంతాల దగ్గర ఏదైనా కార్యాచరణ ప్రణాళిక ఉందో లేదో తెలుసుకోవడానికి తాము ఒకపూట సమయం కేటాయించాల్సి వస్తది. మేం చట్టబద్ధమైన నియమాల అమలును మాత్రమే చూస్తాం. మమ్మల్ని ఆ పని చేయనివ్వండి” అని చెప్పారు.
“ఇది కోర్టు విచారణగా కంటే బహిరంగ వేదికగా మారింది. ప్రతి కుక్కకాటుకు, ప్రతి కుక్కకాటు మరణానికి మేం రాష్ట్రాలపై భారీగా పరిహార భారం వేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రాలు కుక్కకాట్ల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. కుక్కలకు ఆహారం పెట్టేవాళ్లు కుక్కకాటు ఘటనలకు బాధ్యులే” అని కోర్టు వ్యాఖ్యానించింది.

More Stories
జమ్ము-కాశ్మీర్ లో అనుమానాస్పద బెలూన్ తో కలకలం
సెక్షన్ 17ఎ నిబంధన చట్టబద్ధతపై సుప్రీంలో భిన్నాభిప్రాయాలు
భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక క్షిపణి