ఇరాన్ నిరసనలతో 2 వేల మందికి పైగా మృతి

ఇరాన్ నిరసనలతో 2 వేల మందికి పైగా మృతి

ఇరాన్‌ వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో దాదాపు 2 వేల మంది మరణించి ఉంటారని ఇరాన్‌ అధికారులు ఓ వార్తా సంస్థలో పేర్కొన్నారు. మృతుల్లో భద్రతా అధికారులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాదులు, విధ్వంసకారుల చేసిన హింసకే బాధితులు బలైనట్లు ఆరోపించారు. ఆందోళనలు మొదలైన తర్వాత ఇరాన్‌ అధికారులు తొలిసారి అధిక మరణాల సంఖ్యను అంగీకరించారు. 

అయితే, 2 వేల మంది మృతి చెందడంతో ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్‌లో పెరుగుతున్న హింస చాలా భయపెడుతోందని ఐరాస మానవ హక్కుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ భయంకరమైన హింసాత్మక ఘటనలు ఇలాగే కొనసాగితే చాలా కష్టమని ఇరాన్‌పౌరుల న్యాయమైన డిమాండ్లను తప్పక వినాల్సిందేనని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌ పేర్కొంది. 

మరణాలు వందల సంఖ్యలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని ఆ సంస్థ అధికార ప్రతినిధి జెరెమీ లారెన్స్‌ తెలిపారు. అంతేకాదు అరెస్టయిన వారిలో అనేక మందికి మరణశిక్ష పడవచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు. అటు ఇరాన్‌వ్యాప్తంగా 31 ప్రావిన్సుల్లో 600లకుపైగా ప్రదేశాల్లో నిరసనలు కొనసాగినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. వందలాది మంది మృతి చెందగా, 10వేలకు పైగా నిరసనకారులను అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొంది.

 అయితే,  ప్రభుత్వం ప్రకటించిన ఈ సంఖ్యను విపక్షాల అనుకూల వెబ్‌సైట్‌ ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ తీవ్రంగా ఖండించింది. ఇరాన్‌ భద్రతా దళాల చేతుల్లో 12 వేల మందికి పైగానే ఇరాన్‌ పౌరులు మరణించారని వెల్లడించింది. ఇది ఇరాన్‌ ఆధునిక చరిత్రలో అతి పెద్ద మారణ హోమంగా అభివర్ణించింది. కాగా, దేశంలో మరో నాలుగు రోజుల పాటు ఇంటర్‌నెట్‌పై నిషేధాన్ని విధిస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.

విదేశాలకు తమ మొబైల్స్‌ ద్వారా ఫోన్‌ కాల్స్‌ చేసుకోవడానికి అనుమతించింది. ఉగ్రవాద చర్యల కారణంగానే ఈ చర్యలు తీసుకున్నామని విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అర్గాచి తెలిపారు.  ఆందోళనకారులతో చేతులు కలపాల్సిందిగా ఇరాన్‌ భద్రతా బలగాలకు ఇరాన్‌ మాజీ మహారాణి మంగళవారం విజ్ఞప్తి చేశారు. ఆందోళనకారులతో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా వుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం చెలరేగుతున్న నిరసనలకు విదేశీ శక్తుల ఆదేశాలే కారణమని, అందుకే తాము చర్యలు తీసుకోవాల్సి వస్తోందని మంత్రి తెలిపారు.

ఇరాన్‌ ప్రజలకు బాసటగా వున్నామని, నిరసనలు కొనసాగిస్తూనే వుండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరానియన్లకు మంగళవారం పేర్కొన్నారు. వారికి కావాల్సిన సాయం త్వరలో అందుతుందని ఆయన ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. ఈ మోసపూరిత చర్యలు తక్షణమే ఆపాలంటూ అమెరికాను ఇరాన్‌ హెచ్చరించింది.