ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు

ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు
ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌పై ఏ మేర ప్రభావం చూపిస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది.  ఇప్పటికే రష్యాతో చమురు కొనుగోళ్ల కారణంగా 50 శాతం సుంకాలు విధిస్తామనే హెచ్చరికలు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో తాజా నిర్ణయం మరో ఆర్థిక ఒత్తిడే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఇరాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉన్నప్పటికీ భారత్ కూడా కీలకమే. 

భారత రాయబార కార్యాలయం (టెహ్రాన్) గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇరాన్‌కు భారత్ 1.24 బిలియన్ డాలర్ల విలువైన సరుకులను ఎగుమతి చేసింది. అదే సమయంలో ఇరాన్ నుంచి 0.44 బిలియన్ డాలర్ల సరుకులను దిగుమతి చేసుకుంది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య మొత్తం 1.68 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. భారత కరెన్సీలో చెప్పాలంటే ఇది సుమారు రూ.14వేల కోట్ల నుంచి 15 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.

భారత్ నుంచి ఇరాన్‌కు వెళ్లిన ఎగుమతుల్లో ఆర్గానిక్ కెమికల్స్ అగ్రస్థానంలో ఉన్నాయి. వీటి విలువ 512.92 మిలియన్ డాలర్లు. అలాగే పండ్లు, డ్రైఫ్రూట్స్, సిట్రస్ పండ్ల తొక్కలు, మెలాన్లు వంటి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి 311.60 మిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఖనిజ ఇంధనాలు, ఆయిల్స్, డిస్టలేషన్ ఉత్పత్తులకు సంబంధించి 86.48 మిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. 

ఒకవేళ ఈ రంగాలపై అమెరికా టారిఫ్‌ల ప్రభావం పడితే, భారత ఎగుమతిదారులకు నష్టాలు తప్పవని వ్యాపారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.  ఈ నేపథ్యంలో ఇరాన్ వ్యాపారంపై కూడా అదనపు టారిఫ్‌లు విధిస్తే అమెరికా – భారత్ వాణిజ్య చర్చలు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

గత కొన్ని నెలలుగా టారిఫ్‌ల సడలింపు కోసం ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఇలాంటి తరుణంలో ట్రంప్ తాజా నిర్ణయం ఆ ప్రయత్నాలకు ఆటంకంగా మారవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.  ఇదిలా ఉంటే  ట్రంప్ విధిస్తున్న గ్లోబల్ టారిఫ్‌ల చట్టబద్ధతపై అక్కడి అత్యున్నత న్యాయస్థానంలో కేసు కొనసాగుతోంది. ఈ కేసులో బుధవారం తీర్పు వెలువడనుంది. ఒకవేళ ట్రంప్‌నకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై తక్షణమే టారిఫ్‌లు విధించే అధికారాలు పరిమితమయ్యే అవకాశం ఉంది.

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ స్పందిస్తూ ఇరాన్ విషయంలో ట్రంప్ అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారని చెప్పారు. సైనిక చర్య కూడా ఒక ఎంపికేనని, అయితే ముందుగా దౌత్యపరమైన పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. “ప్రెసిడెంట్ అవసరమైతే సైనిక చర్యకు వెనుకాడరు. అది ఇరాన్‌కు కూడా తెలుసు” అని ఆమె వ్యాఖ్యానించారు.

అమెరికా హెచ్చరికలపై ఇరాన్ కూడా గట్టిగా స్పందించింది. తమ దేశంపై ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ తెలిపారు. “ఇరాన్ సమగ్రతను కాపాడేందుకు ప్రజలు, సైన్యం సిద్ధంగా ఉన్నాయి. విదేశీ జోక్యం వల్లే అల్లర్లు జరుగుతున్నాయి” అని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉండగా ఇరాన్‌లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. అజర్బైజాన్ ప్రావిన్స్‌తో పాటు అరాక్ వంటి నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ తెలిపింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక ఇబ్బందులు, పాలనపై అసంతృప్తి కారణంగా ప్రజలు రోడ్డెక్కారు.  హ్యూమన్ రైట్స్ న్యూస్ ఏజెన్సీ సమాచారం ప్రకారం ఇప్పటివరకు కనీసం 646 మంది మృతి చెందగా, 10,681 మందిని అరెస్టు చేసి జైళ్లకు తరలించారు. మరోవైపు ప్రభుత్వం అనుకూలంగా కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.

మరోవైపు, ఇరాన్‌లోని అమెరికా పౌరులకు అగ్రరాజ్య ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశంలో ఉద్రిక్తతలు మరింత హింసాత్మకంగా మారే అవకాశం ఉందని, తక్షణమే ఆ దేశాన్ని వీడాలని తమ పౌరులను హెచ్చరించింది. ఒకవేళ దేశం నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలివెళ్లాలని సూచించింది.  ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేపట్టే అవకాశాలున్నట్లు వార్తలు వస్తోన్న వేళ జారీ చేసిన తాజా హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.