కాశ్మీర్ లో తొలిసారి మసీదుల్లో పోలీసుల తనిఖీలు

కాశ్మీర్ లో తొలిసారి మసీదుల్లో పోలీసుల తనిఖీలు
తీవ్రవాదానికి అడ్డాగా మారిన  జమ్మూ-కాశ్మీర్ లో పోలీసులు మసీదుల్ని జల్లెడ పడుతున్నారు. ప్రతి మసీదుకు వెళ్లి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం నాలుగు పేజీల ఫాంలు సిద్ధం చేశారు. మసీదుల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఈ పత్రం నింపాల్సి ఉంటుంది. మసీదు వివరాల కోసం 4 పేజీల పత్రం, వ్యక్తిగత వివరాల కోసం మూడు పేజీల మరో పత్రం నింపాల్సి ఉంటుంది.

పోలీసులు ఇలాంటి ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి. మసీదులు నిర్వహించే ఇమామ్ ల దగ్గరి నుంచి ముయెజ్జిన్ , ఖతీబ్స్, బైట్ ఉల్ మాల్ వంటి వారి వివరాలు సేకరిస్తున్నారు. అంటే అక్కడ మసీదు పెద్దతోపాటు, ప్రార్థనలు చేయించే వారు, సేవా కార్యక్రమాలు చూసే వారితోపాటు అక్కడికి వచ్చే వారి సంఖ్య, వారి పేర్లు, ఇతర వివరాల్ని కూడా నమోదు చేసుకుంటున్నారు. 

ఈ పత్రాలలో మసీదు ఎప్పుడు కట్టారు? ఎన్ని ఫ్లోర్లు.. వైశాల్యం.. ఆదాయ వనరులు.. నిధులు.. ల్యాండ్ టైప్.. బ్యాంకు వివరాలు.. దాతల వివరాలు.. ఖర్చులు.. అక్కడ సాగించే కార్యకలాపాలు.. టైమింగ్స్ తోపాటు మసీదు నిర్వహించే వారు, ఇతర సిబ్బందికి సంబంధించిన పేర్లు, ఫోన్ నెంబర్లు, వారి బ్యాంక్ డీటైల్స్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, పాస్ పోర్ట్, వాడే మొబైల్ మోడల్, ఐఎంఈఐ నెంబర్లు, ఈ మెయిల్, ట్రావెల్ హిస్టరీ, బర్త్ డేట్, ఆదాయ వివరాలు, ఏటీఎం, క్రెడిట్, రేషన్ కార్డులు, మసీదుల విలువ, అనుమతులు వంటివన్నీ సేకరిస్తున్నారు. దీని ద్వారా ఇక్కడి అసాంఘిక, తీవ్రవాద కార్యకలాపాల్ని అడ్డుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని వ్యక్తుల కదలికలపై పూర్తి నిఘా పెట్టేందుకు వీలుంటుంది.

మసీదు నిర్వహణ కమిటీ సభ్యులు, ఇమామ్‌లు, ముయజ్జిన్‌లు, ఖతీబ్‌లు, బైత్-ఉల్-మాల్ సభ్యుల పూర్తి కుటుంబ వివరాలతో పాటు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ చిరునామాలు, విద్యార్హతల వంటి వ్యక్తిగత సమాచారాన్ని కూడా కోరుతున్నారు. వ్యక్తులను పాస్‌పోర్ట్ వివరాలు, ప్రయాణ చరిత్ర, విదేశాలలో నివసిస్తున్న బంధువుల గురించిన సమాచారాన్ని కూడా అందించమని కోరుతున్నారు.