మధుమేహం వ్యాధి కారణంగా ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉందంటూ వెలువడిన తాజా అధ్యయన నివేదిక ఆందోళన రేకెత్తిస్తోంది. ఆస్ట్రియాలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్, వియన్నా యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్‌లకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
మధుమేహం వ్యాధి వల్ల 2020 నుంచి 2050 మధ్యకాలంలో 204 ప్రపంచ దేశాలపై ఎంతమేర ఆర్థిక భారం పడుతుంది అనేది అంచనా వేసేందుకు వారు ప్రయత్నించారు. నేచర్ జర్నల్‌లో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. దేశంలోని మధుమేహం వ్యాధిగ్రస్తుల వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై దాదాపు రూ.1,028 లక్షల కోట్ల (11.4 ట్రిలియన్ డాలర్లు) భారం పడుతుంది.
ఈ జాబితాలో మొదటి స్థానంలో అగ్రరాజ్యం అమెరికా ఉంది. పెద్ద సంఖ్యలో మధుమేహం వ్యాధిగ్రస్తులు ఉన్నందు వల్ల ఆ దేశంపైనా రూ.1,488 లక్షల కోట్ల (16.5 ట్రిలియన్ డాలర్లు) ఆర్థిక భారం పడుతుంది. మూడో స్థానంలో మన పొరుగుదేశం చైనా ఉంది. అక్కడ కూడా పెద్దసంఖ్యలో చక్కెర వ్యాధిగ్రస్తులు ఉన్నందున, చైనాపైనా రూ.9,92 లక్షల కోట్ల (11 ట్రిలియన్ డాలర్లు) ఆర్థిక భారం పడుతుంది.
ఏటా ప్రపంచవ్యాప్తంగా మధుమేహం వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం అధికారికంగా దాదాపు రూ.9,01 లక్షల కోట్ల (10 ట్రిలియన్ డాలర్లు)ను వెచ్చిస్తున్నారని అంచనా. ఇది ప్రపంచ వార్షిక స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో దాదాపు 0.2 శాతానికి సమానం. అనధికారికంగా మధుమేహం వ్యాధిగ్రస్తుల కోసం కుటుంబీకులు ఏటా చేస్తున్న ఖర్చులు ఇంకా ఎక్కువే ఉంటున్నాయి. వాటి విలువ ఏకంగా రూ.1,371 లక్షల కోట్ల (152 ట్రిలియన్ డాలర్లు) దాకా ఉంటుందని అంచనా. ఇది ప్రపంచ వార్షిక జీడీపీలో 1.7 శాతానికి సమానం.
‘‘ఇంట్లోని మధుమేహం రోగికి వైద్యచికిత్సలు చేయించే కుటుంబీకుడికి ఏదైనా జరిగితే పరిస్థితి పూర్తిగా గాడి తప్పుతుంది. ఆ వ్యక్తి కొంతకాలం పాటు ఉద్యోగాన్ని కోల్పోయినా యావత్ కుటుంబంపై ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లోని మధుమేహం రోగికి సకాలంలో తగిన చికిత్స చేయించడం కష్టతరంగా మారుతుంది’’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న వియన్నా యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ప్రొఫెసర్ క్లౌజ్ ప్రెట్నెర్ తెలిపారు.
‘భారత్, చైనాలలో పెద్ద సంఖ్యలో మధుమేహం రోగులు ఉన్నారు. ఈ రెండు దేశాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే అమెరికాలో చక్కెర వ్యాధిగ్రస్తులు ఉన్నారు. కానీ అగ్రరాజ్యంలో వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ భారాన్ని అక్కడి ప్రభుత్వమే భరిస్తుంది. మధుమేహం వ్యాధిగ్రస్తుల వైద్య బిల్లులను అమెరికా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈవిధంగా వైద్య ఖర్చులకు భారీ కేటాయింపులు చేస్తుండటంతో అమెరికా లాంటి సంపన్న దేశాలపై మధుమేహం రోగుల వల్ల సగటున 41 శాతం మేర ఆర్థిక భారం పడుతోంది. ప్రజలకు మెరుగైన ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు లేకపోవడం వల్ల భారత్ లాంటి అల్ప ఆదాయ దేశాలపై సగటున 14 శాతం మేర ఆర్థిక భారం పడుతోంది.

More Stories
ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు
వందేభారత్ స్లీపర్ కనీస ఛార్జీ రూ.960
22 భాషల్లోకి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనువాదం