22 భాషల్లోకి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనువాదం

22 భాషల్లోకి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనువాదం

* ఈ-సిగ‌రేట్ తాగిన వారికి క‌ఠిన శిక్ష త‌ప్ప‌దు

జనవరి 28 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలను స్థానిక భాషల్లోకి అనువదించనున్నామని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. పార్లమెంటు సమావేశాలను స్థానిక భాషల్లో వీక్షించేలా ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ బడ్జెట్‌ సమావేశాల నుంచే ఈ ప్రక్రియ అమల్లోకి రానుందని వెల్లడించారు. 22 భారతీయ భాషల్లో సమాంతర అనువాదం అమల్లోకి తెస్తున్నట్టు వివరించారు. 

ప్రస్తుతం 10 భాషల్లో కసరత్తు కొలిక్కి వచ్చిందని, మిగిలిన వాటిపై పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఏఐ ఆధారిత సేవలతో పార్లమెంటు దస్త్రాలను 22 భాషల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. పార్లమెంటు సభ్యులూ తమ సొంత భాషల్లో మాట్లాడేందుకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. డిజిటల్‌ సంసద్‌ యాప్‌ ద్వారా అన్ని రాష్ట్రాల బడ్జెట్‌ ప్రతులు ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఓం బిర్లా చెప్పారు. 

అసెంబ్లీ దస్త్రాల డిజిటలైజేషన్‌ పూర్తైన తర్వాత వాటిని డిజిటల్‌ సంసద్‌ పోర్టల్‌కి అనుసంధానం చేస్తామని వివరించారు. పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సభలో ప్రస్తావించడానికి ముందురోజు రాత్రికే సమాధానాలు ఆయా సభ్యులకు చేర్చే విధంగా సరికొత్త ప్రక్రియను తీసుకువస్తున్నట్లు స్పీకర్‌ తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటు ప్రొసీడింగ్స్‌ పొందడానికి సభ్యులకు గంట సమయం పడుతోందని దాన్ని అరగంటకు తగ్గిచేందుకు నూతన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.

2027 నాటికి పార్లమెంటు కార్యకలాపాలను అన్ని భారతీయ భాషల్లోకి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రజలు తమకు ఏ భాషలో కావాలనుకుంటే ఆ భాషలో చూసుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు.  కాగా, సభలో ఈ-సిగ‌రేట్ తాగిన వారికి క‌ఠిన శిక్ష త‌ప్ప‌ద‌ని,  పార్ల‌మెంట్ మ‌ర్యాద‌ను కాపాడే అంశంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ఓం బిర్లా స్పష్టం చేశారు.

స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ బ‌హిరంగంగా ఈ-సిగ‌రేట్ తాగిన‌ట్లు బీజేపీ స‌భ్యుడు అనురాగ్ ఠాకూర్ ఇటీవ‌ల స్పీక‌ర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. పార్ల‌మెంట్ స‌భ్యులు ఈ-సిగ‌రేట్ తాగిన అంశం ద‌ర్యాప్తులో ఉన్న‌ద‌ని, సంబంధిత క‌మిటీకి ఈ విష‌యాన్ని చేర‌వేస్తామ‌ని, ఆ త‌ర్వాత చ‌ర్య‌లు ఉంటాయ‌ని తెలిపారు. క‌మిటీ ఇచ్చిన ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం చ‌ర్య తీసుకుంటామ‌ని చెబుతూ స‌భ‌లో అంద‌రూ హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని, స‌భ్య‌త్వం కోల్పోయే అవ‌కాశం కూడా ఉంద‌ని లోక్‌స‌భ స్పీక‌ర్ వెల్ల‌డించారు.

స‌భా హుందాత‌నాన్ని కాపాడడం బాధ్య‌త అని, మ‌ర్యాదును పాటించ‌నివారికి నియామ‌వ‌ళి ప్ర‌కారం శిక్ష ఉంటుంద‌ని తేల్చి చెప్పారు.  ప్రస్తుతం మానవ వనరుల ద్వారా జరుగుతున్న అనువాదం ఇక నుంచి ఏఐ ఆధారిత సేవలకు మార్చబోతున్నామని వివరించారు. భారత పార్లమెంటు ఇప్పటికీ ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటిస్తోందని చెప్పారు. త్వరలోనే డిప్యూటీ స్పీకర్‌ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.