‘మానస’ లో వృత్తి నైపుణ్యాల ద్వారా దివ్యాంగుల సాధికారత

‘మానస’ లో వృత్తి నైపుణ్యాల ద్వారా దివ్యాంగుల సాధికారత
*  మానసిక దివ్యాంగ యువతకు  తోటపని  శిక్షణ ప్రారంభం 
తోటపని లో పాల్గొనటం ద్వారా మానసిక దివ్యాంగులలో సైతం ఉల్లాసం ఆత్మనిర్భరత పెరుగుతాయని సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ నిపుణులు జి. నాగరత్నం నాయుడు తెలిపారు.   స్వామి వివేకానంద 163వ జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా “వృత్తి నైపుణ్యాల ద్వారా దివ్యాంగుల సాధికారత” అనే అంశం పై `మానస’ చిన్నారుల ఆరోగ్య వైకల్యాల అధ్యయన సంస్థలో జరిగిన సెమినార్ లో గౌరవ అతిధిగా పాల్గొంటూ   తమ కాళ్ళమీద తాము నిలబడేటట్లు చేయటమే విద్య లక్ష్యంగా ఉండాలని స్వామి వివేకానంద పేర్కొనటాన్ని గుర్తు చేశారు.  భూమాత వడిలో ప్రకృతితో మమేకం కావటం వల్ల అనేక  శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. 

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి  పి. సదానందం మాట్లాడుతూ మానసిక దివ్యంగులలో ఇంద్రియ నైపుణ్యాలు మెరుగు పరచటం, బాధ్యతా భావం, జట్టు పని పెంపొందించే లక్ష్యంతో మానసలో మొక్కల నర్సరీ ప్రారంభించటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక విద్య,  ఫీజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ,  బిహేవియర్ థెరపీ  సేవలు అందిస్తున్న మానస వంటి స్వచ్చంద సేవా సంస్థలకు చేయూత అందించటం సమాజంలో ప్రతిఒక్కరి బాధ్యత అని చెప్పారు.

ప్రముఖ పర్యావరణ నిపుణురాలు, కేంద్ర ప్రభుత్వం నియమించిన పర్యావరణ సంబంధిత తెలంగాణా రాష్ట్ర మూల్యాంకన నైపుణ్య సంస్థ సభ్యురాలు డాక్టర్ సరిత సజ్జ మాట్లాడుతూ నాగరికత మనుగడ కొనసాగాలంటే పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యాల  మధ్య సమతుల్యత పాటించటం తప్పనిసరి అని స్పష్టం చేశారు. హస్తకళలు, కుట్టుపని, ఆహార ఉత్పత్తి వంటి వృత్తి విద్యాలతో పాటు కొత్తగా నర్సరీ రంగంలో సైతం మానసిక దివ్యాంగులకు శిక్షణ ఇచ్చే ప్రయత్నం ‘మానస’  చేయటం అభినందనీయం అని కొనియాడారు.

శూన్య టాక్స్ సోలుషన్స్ పార్టనర్ కె. నరసింహా రావు మాట్లాడుతూ సామాజిక  ఉపయుక్త ఉత్పాదక పని తాను జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకొన్నప్పుడు ఒక బోధనా విషయంగా ఉండటం అనేక పనులు సొంతంగా చేసుకొనే నేర్పరితనం తనకు అలవాడేటట్లు చేసిందని తెలిపారు. 
 
చలకుర్తి క్యాంప్,  నల్లగొండ జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రారంభ కార్యక్రమం  సరిగ్గా 39 సంవత్సరాల క్రితం ఇదేరోజున  జరిగిందని చెబుతూ ఆ విద్యాలయంలో చదువుకొన్న అనేకమంది మిత్రులు పూర్వ విద్యార్థులు నలుగురు నవోదయ ఉపాధ్యాయులతో కలిసి మానసిక దివ్యంగులతో కలిసి మానస లో  మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనటం ఆనందంగా ఉన్నాదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో  మానస ప్రత్యేక పాఠశాల విద్యార్థులు  సాంస్కృతిక కార్యక్రమాలతో అతిధులను అలరించారు. కార్యక్రంలో పాల్గొన్న ప్రత్యేక విద్యార్థుల తల్లిదండ్రులు, అతిధులు ప్రత్యేక విద్యార్థులతో కలిసి ఔషధ మొక్కలతో సహా అనేక మొక్కలు నాటటంలో ఉత్సహంగా పాల్గొన్నారు.  మానస అధ్యక్షులు డాక్టర్ దినేష్ కుమార్, కోశాధికారి సి. వి. సుబ్బారావు కూడా పాల్గొన్నారు.