తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ సోమవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో కీలక నిందితుడుగా ఉన్న విజయ్‌కి సీబీఐ గతవారం సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అధికారులు విజయ్‌ని విచారిస్తున్నారు.
సోమవారం ఉదయం చెన్నై నుంచి దిల్లీకి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన, నేరుగా ఉదయం 11.30 గంటలకు విజయ్ బ్లాక్ కలర్ రేంజ్ రోవర్‌లో డిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. విజయ్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని ముందే అంచనా వేసిన పోలీసులు, ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) అనేక బృందాలను మోహరించారు. ఎలాంటి నిరసనలు జరగకుండా భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అనంతరం అవసరమైన ప్రాథమిక విధానాలు పూర్తయ్యాక, గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనను దర్యాప్తు చేస్తున్న యాంటీ కరప్షన్ యూనిట్ బృందం ముందు విజయ్‌ను విచారించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, విజయ్ ఉదయం 7 గంటలకు చెన్నై నుంచి చార్టర్డ్ విమానంలో ఢిల్లీకి బయలుదేరారు.
ఆయనతో పాటు టీవీకే నేతలు ఆదవ్ అర్జున్ సహా మరికొందరు కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో టీవీకేకు చెందిన పలువురు కార్యాలయ నిర్వాహకులను సీబీఐ విచారించింది. ఇదే కేసులో తమిళనాడు మాజీ అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎస్. డేవిడ్సన్ దేవసిర్వథమ్‌ను కూడా సీబీఐ సమన్లు జారీ చేసి విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తొక్కిసలాట కేసును తొలుత ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సీనియర్ అధికారితో విచారణ చేయించాలని ఆదేశించింది.
అంతేకాదు, సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ పట్టణంలో విజయ్ ప్రచార ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 110 మంది గాయపడ్డారు.
More Stories
అమెరికాకు భారత్ కంటే కావాల్సిన దేశం ఇంకోటి లేదు
జర్మన్ యూనివర్సిటీలు భారత్ లో క్యాంపస్ లు ప్రారంభించాలి
ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా భారత్ లో మాత్రం స్థిరత్వం