కేరళలో ఈ సారి కచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రి

కేరళలో ఈ సారి కచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రి

కేరళలో కమలం గుర్తుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అంతిమ లక్ష్యమని చెబుతూ ఈ సారి ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రి ఎన్నికవుతారని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. నూతనంగా ఎన్నికైన బీజేపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ  వచ్చే కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం చేపట్టిన మిషన్ 2026 ప్రోగ్రాంను ప్రారంభించారు.

“ఈ విజయం మన లక్ష్యం కాదు. లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో తొలి మైలురాయి. కమలం గుర్తుతో కేరళలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మన అంతిమ లక్ష్యం. కేరళను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేయడమే మన లక్ష్యం. దేశవ్యతిరేక శక్తుల నుంచి కేరళను రక్షించాలి. శతాబ్దాలుగా కేరళలో ఉన్న నమ్మకాలను కాపాడేందుకు కృషి చేయాలి” అని పిలుపిచ్చారు. 

“ఈ మూడు పనులను యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పూర్తి చేయలేవని కేరళ ప్రజలకు కూడా తెలుసు. కేవలం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏతో మాత్రమే ఇది సాధ్యం. 2047 నాటికి వికసిత్ భారత్గా మార్చేందుకు నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారు. అభివృద్ధి చెందిన కేరళతోనే అభివృద్ధి చెందిన భారత్ కల సాకారం అవుతుందనే విషయాన్ని చెప్పేందుకు ఇక్కడికి వచ్చాను” అని తెలిపారు.

శబరిమల ఆలయం బంగారం చోరీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ దీనిపై తటస్థ దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. శబరిమల ఆలయంలోని ఆస్తులను కాపాడడంలో విఫలమైన వారు ప్రజల నమ్మకాన్ని ఎలా కాపాడుతారని అమిత్ షా ప్రశ్నించారు. కేరళ ప్రజల నమ్మకాలను బీజేపీ మాత్రమే రక్షిస్తుందని తేల్చి చెప్పారు. 

 
శబరిమల బంగారం చోరీ కేవలం కేరళ ప్రజలు మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరి సమస్యని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను గమనిస్తే నిందితులను రక్షించేందుకు రూపొందినట్లుగా ఉందని ఆరోపించారు. “శబరిమల కేసులో తటస్థ సంస్థతో దర్యాప్తు చేపించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను డిమాండ్ చేస్తున్నాను. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టడమే కాకుండా ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలు చేపడుతాం.” అని అమిత్ షా ప్రకటించారు.

“సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ రెండు మ్యాచ్ ఫిక్సింగ్ అయి కేరళ అభివృద్ధిని అడ్డుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు అంతరించిపోయాయి. దేశమంతా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతోంది. అభివృద్ధి చెందిన కేరళ కేవలం ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏతోనే సాధ్యం” అని హోంమంత్రి స్పష్టం చేశారు. 
 
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ఆయన చెప్పారు. కేరళ ప్రజల్లో బీజేపీకి మద్దతు పెరుగుతోందని చెబుతూ 2014లో 11శాతం, 2019లో 16 శాతం ఓట్లు వచ్చాయని, అదే 2024లో 20 శాతం ఓటింగ్ వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు 20- 30 శాతం లేదా 40 శాతం ఓట్లు వచ్చేందుకు ఎంతో దూరం లేదని 2026లో నిరూపిస్తామని భరోసా వ్యక్తం చేశారు. 
 
“30 గ్రామపంచాయితీల్లో గెలిచాం. తిరువనంతపురం మేయర్ సహా రెండు మున్సిపాలిటీలు గెలిచాం. వందలాది మంది బీజేపీ కార్యకర్తలు వారీ జీవితాలను త్యాగం చేయడం వల్లే ఈ విజయాలు సొంతమయ్యాయి. ఈరోజు మనం సాధించిన ఈ విజయాన్ని పార్టీ కోసం జైలు పాలైన వారికి , వారి కుటుంససభ్యులకు అంకింతం చేస్తున్నాను.” అని అమిత్ షా తెలిపారు.