ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా భారత్ లో మాత్రం స్థిరత్వం

ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా భారత్ లో మాత్రం స్థిరత్వం

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్ రాజకీయ స్థిరత్వం, సుస్థిరతతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని పేర్కొంటూ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తుందని వెల్లడించారు. ప్రస్తుత సమయంలో మౌలిక సదుపాయాలతో పాటు, పరిశ్రమలకు సిద్ధంగా ఉన్న కార్మిక శక్తి అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆదివారం గుజరాత్ కచ్ లో ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రారంభిస్తూ  “ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం భారత ప్రగతిపై ప్రపంచవ్యాప్తంగా ఆశలు పెట్టుకున్నాయని స్పష్టమవుతోంది” అని చెప్పారు. 

“భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. పాల ఉత్పత్తిలో మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. జనరిక్ మందుల ఉత్పత్తిలో నంబర్ వన్గా ఉన్నాం. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్” అని ప్రధాని గుర్తు చేశారు. 

“గత 11 ఏళ్లుగా భారత వృద్ధి గణాంకాలు ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా వినియోగదారు భారత్. మన యూపీఐ ప్రపంచంలోనే రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీల్లో మొదటిగా రికార్డ్ సాధించింది. ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఉత్పత్తిదారుగా భారత్ నిలిచింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్, మూడో అతిపెద్ద పౌరవిమానయాన మార్కెట్గా ఉంది” అని ప్రధాని మోదీ వివరించారు.

అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోందని చెబుతూ ఈ లక్ష్యాన్ని అందుకోవడంలో సంస్కరణలే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. భారత్ ను ఐఎంఎఫ్ ప్రపంచ వృద్ధికి ఇంజిన్ గా అభివర్ణించిందని, భారత రేటింగ్ ను 18 ఏళ్ల తర్వాత ఎస్ అండ్ పీ సవరించిందని తెలిపారు. ఫిచ్ రేటింగ్స్ కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని అభినందించిందని పేర్కొంటూ మౌలిక సదుపాయాలతో పాటు కార్మిక శక్తి కూడా అవసరం ఉంని చెప్పారు.

ఆత్మనిర్భర్ భారత్ ప్రచారానికి ఊతం ఇవ్వడానికి సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం ప్రధాన కేంద్రంగా మారుతున్నాయని మోదీ కొనియాడారు. భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడంలో సౌరాష్ట్ర, కచ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక్కడి వివిధ పారిశ్రామిక క్లస్టర్లలో, స్క్రూడ్రైవర్ల నుంచి ఆటో విడిభాగాలు, యంత్ర పరికరాలు, లగ్జరీ కార్ లైనర్లు, విమానాల విడిభాగాలు, యుద్ధ విమానాలు, రాకెట్ల వరకు ప్రతిదీ రాజ్‌కోట్‌లో తయారు చేస్తున్నారని మోదీ తెలిపారు.