* ఉంగుటూరులో నివేదిత గురుకులం నూతన భవనం ప్రారంభించిన గవర్నర్ హరిబాబు
బాలికల విద్య సామాజిక మార్పుకు నాంది అని పేర్కొంటూ అది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు తెలిపారు. ఉంగుటూరులో నివేదిత గురుకులం నూతన భవనం ప్రారంభోత్సవం, ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ గురుకులం అనేది కేవలం విద్యను అందించే సంస్థ మాత్రమే కాదని, అది ఒక సంపూర్ణ జీవన విధానాన్ని బోధిస్తుందని, క్రమశిక్షణ, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని తెలిపారు.
బాలికల విద్యకు అంకితమైన గురుకులం సామాజిక మార్పుకు శక్తివంతమైన కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. బాలికల విద్యా అనేది ఒక అవకాశం కాదని, అది దేశ భవిష్యత్తును నిర్మించే మౌలిక అవసరమని బలంగా గుర్తించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒక బాలిక విద్యను పొందితే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుందని, ఆ కుటుంబాలు అభివృద్ధి చెందితే సమాజం బలపడుతుందని, సమాజం బలపడితే దేశం ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు.
సిస్టర్ నివేదిత ఒక అసాధారణమైన మహనీయురాలు అని, ధైర్యం, అంకిత భావం, స్వార్థరహిత సేవ ఆమె జీవన తత్వానికి ప్రతిరూపాలని గవర్నర్ కొనియాడారు. ఆమె పాశ్చాత్య దేశంలో జన్మించినప్పటికీ, భారతదేశాన్ని ఆమె తన ఆధ్యాత్మిక, సామాజిక కర్మభూమిగా స్వీకరించిందని, మహిళలు, బాలికల విద్య సాధికారతకు తన సంపూర్ణ జీవితాన్ని అంకితం చేశారని ఆమె సేవలను కొనియాడారు.
మహిళలు విద్యావంతులై ఆత్మవిశ్వాసంతో తమ సాంస్కృతిక మూలాలతో అనుసంధానమై ఎదిగినప్పుడే నిజమైన జాతీయ పురోగతి సాధ్యమవుతుందని ఆమె దృఢంగా నమ్మారని డా. హరిబాబు తెలిపారు. విలువలతో కూడిన విద్య, సాంస్కృతిక చైతన్యం, సమాజ హితం కలిగిన విద్యను గురుకులం కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతీయ సంస్కృతి ఆధారంగా, ఆధునిక అవసరాలకు అనుగుణంగా విలువలతో కూడిన విద్యను అందిస్తున్న గురుకులం నిర్వహణ కమిటీ దూర దృష్టిని అభినందిస్తున్నని ఆయన ప్రశంసించారు.
భారతీయ సంగీతం, యోగ, ధ్యానం, వేద పఠనం వంటి ప్రక్రియలను ఈ గురుకులం నుండి పొందిన విద్యార్థులు భవిష్యత్తులో భారతీయ సాంస్కృతిక రాయబారులుగా తయారవుతారని విశ్వసిస్తున్నానని చెప్పారు. బాలికల విద్యకు ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయని, రాజకీయంగా, వ్యోమగామిగా, ఆపరేషన్ సింధూర్ తదితర అన్ని రంగాలలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఇది మంచి శుభపరిణామం అని పేర్కొన్నారు.
అయితే, షెడ్యూల్ జాతుల బాలికల విద్యను ఇతరులతో పోల్చి చూసినప్పుడు అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నామని విచారం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇది ఒడిశా రాష్ట్రంలో గిరిజన ప్రజల్లో అత్యధికంగా ఉందని, అటువంటి వారిని అన్ని ప్రాంతాలలో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఆయన సూచించారు. ప్రాథమిక విద్యకు బలమైన పునాది ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020ను తీసుకొచ్చిన సందర్భాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఉద్యోగార్దులుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే వారిగా విద్యార్థులను తయారు చేయడమే గురుకుల ముఖ్య బాధ్యతగా పెట్టుకోవాలని సూచించారు. తొలుత విద్యార్థులు హోమం ప్రక్రియ నిర్వహించడంతో పాటు కోలాటం, యోగాసనాలు, యోగ చాప్, తాడు(రోప్)యోగ, సైకిల్ విన్యాసం, జడ కోలాటం, తదితర వ్యాయామ ప్రక్రియలు ప్రదర్శించారు. అదేవిధంగా కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ధాత్రిరెడ్డి, శ్రీ విజ్ఞాన విహార ఉపాధ్యక్షుడు వల్లభనేని సుధాకర్ చౌదరి, శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ అధినేత డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, జయరామ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యుడు దాసరి వెంకట బాలవర్ధన రావు, కేఎల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, విహెచ్పి జాతీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారిణి సభ్యుడు భాగయ్య తదితరులు పాల్గొన్నారు.
More Stories
పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగంలో అంతరాయం
‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ గా పవన్ కళ్యాణ్
బంగ్లా హిందువులపై దాడులు అంతిమంగా భారత్ పై గురి!