జర్మన్ యూనివర్సిటీలు భారత్ లో క్యాంపస్ లు ప్రారంభించాలి

జర్మన్ యూనివర్సిటీలు భారత్ లో క్యాంపస్ లు ప్రారంభించాలి
భారత- జర్మనీ ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారం మానవాళికి ముఖ్యమని చెబుతూ జర్మన్ విశ్వవిద్యాలయాలు భారత్​లో తమ క్యాంపస్​లను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు. భారత పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్​ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌తో సమావేశమైన నేపథ్యంలో విద్యా రంగంలోనూ ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని పెంచేందుకు రోడ్​మ్యాప్​పై చర్చించారు. 
 
గుజరాత్​ రాజధాని గాంధీనగర్​​లో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇందులో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​, విదేశాంక కార్యదర్శి విక్రమ్​ మిస్రీ పాల్గొన్నారు. వాణిజ్యం సహా పెట్టుబడులు, శాస్త్ర, సాంకేతికం, విద్య, నైపుణ్యం, రక్షణ, భద్రత, పరిశోధన రంగాల్లో సంబంధాల బలోపేతంపై చర్చించారు.
 
“భారత్- జర్మనీ సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉంది. గతేడాది ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఇక ఈ ఏడాది మన దౌత్య సంబంధాలు 75ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఇవి కేవలం మైలురాళ్లు మాత్రమే కాదు. ఇవి మన రెండు దేశాల కలలు, పరస్పర నమ్మకం, సంబంధాల బలోపేతానికి ప్రతీకలు” అని ప్రధాని మోదీ తెలిపారు. 
 
“భారత్​- జర్మనీ లాంటి రెండు ఆర్థిక వ్యవస్థల భాగస్వామ్యం ప్రపంచావనికి ఎంతో కీలకం. వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇరు దేశాల వాణిజ్యం, పెట్టుబడులు కొత్త శక్తిని అందిస్తాయి. ఇరు దేశాలు సంయుక్తంగా వాతావరణం, ఇంధనం, పట్టణాభివృద్ధి రంగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నాం. భారత్- జర్మనీ కలిసి బలమైన, నమ్మకమైన, స్థిరమైన సప్లై చెయిన్లను నిర్మిస్తున్నాం. ఇందుకు సంబంధించిన ఒప్పందాలను ఈరోజు చేసుకున్నాం” అని ప్రధాని వెల్లడించారు.
 
“ఆసియా పర్యటనలో భాగంగా జర్మనీ ఛాన్స్‌లర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ మొదటగా భారత్​లోనే పర్యటించారు. ఇది భారత్​పై జర్మనీకి ఉన్న నమ్మకాన్ని, ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. భారత పౌరులకు వీసా రహిత ప్రయాణాన్ని ప్రకటించిన జర్మనీ ఛాన్స్‌లర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌కు నా కృతజ్ఞతలు. ఇరు దేశాల మధ్య సంబంధాలను ఇది మరింత బలోపేతం చేస్తుంది” అని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
 
ఇండో- పసిఫిక్​ ప్రాంతం ఇరు దేశాలకు చాలా ముఖ్యమైనది. అందుకే ఈ ప్రాంతంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త వ్యవస్థను ప్రారంభించబోతున్నామని ప్రధాని చెప్పారు. ఈ రోజు మా సమావేశంలో ఉక్రెయిన్, గాజా సహా అనేక రకాల ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించామని, అన్ని సమస్యలకు శాంతి చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని భావించి ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు. “మానవత్వానికి ఉగ్రవాదం శత్రువని ఏకగ్రీవంగా అంగీకరించాం. అందుకే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయి. అంతర్జాతీయ సమస్యలను చర్చిచేందుకు ప్రపంచ వేదికల్లో సంస్కరణలు తీసుకరావాలని అంగీకరించాం.” అని ప్రధాని  మోదీ చెప్పారు.
తాను ఛాన్సలర్‌గా పర్యటిస్తున్న మొదటి ఆసియా దేశం భారతదేశమే కావడం యాదృచ్ఛికం  కాదని నొక్కి చెబుతూ, అనేక దేశాలకు సవాళ్లు విసురుతున్న లోతైన ప్రపంచ మార్పులు చోటుచేసుకుంటున్న సమయంలో ఈ పర్యటన జరుగుతోందని ఫ్రీడ్రిక్ మెర్జ్ తెలిపారు. “సాంకేతిక మార్పు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు మన ఆర్థిక వ్యవస్థలు పనిచేసే, పోటీపడే విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారతదేశం, జర్మనీ మధ్య భాగస్వామ్యం ఆర్థికంగా, రాజకీయంగా, ప్రపంచ సందర్భంలో ఒక వ్యూహాత్మక ఆస్తి…” అని మెర్జ్ పేర్కొన్నారు.
 
అంతకుముందు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌తో కలిసి కైట్‌ ఫెస్టివల్‌ను మోదీ ఆరంభించారు. అనంతరం జర్మనీ ఛాన్స్‌లర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌తో కలిసి ప్రధాని మోదీ గాలిపటం ఎగురవేశారు. ప్రాంగణంలో సాంస్కృతిక ప్రదర్శనలను ఇరువురు నేతలు తిలకించారు. మెర్జ్‌తో కలిసి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ప్రధాని మోదీ మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు.