అమెరికాకు భారత్ కంటే కావాల్సిన దేశం ఇంకోటి లేదు

అమెరికాకు భారత్ కంటే కావాల్సిన దేశం ఇంకోటి లేదు

ఇటీవల ఇండియాపై వరుస ఆంక్షలు విధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్న అగ్రదేశం అమెరికా తాజాగా సానుకూల ప్రకటన చేసింది. అమెరికాకు భారత్ కన్నా ఆవశ్యకమైన దేశం మరోటి లేదంటూ ప్రకటించింది. ఈ మేరకు భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ప్రకటన చేశారు.  ఆయన భారత్ లో అమెరికా రాయబారిగా సోమవారం బాధ్యతలు చేపట్టగానే నిలిచిపోయిన భారత్-అమెరికా సంబంధాలను పునరుద్ధరించడంపై ఆశాజనకంగా ఉన్నట్లు సంకేతం ఇచ్చారు. 

నిజమైన స్నేహితులు ‘విభేధించవచ్చు’, కానీ వారు ఎల్లప్పుడూ తమ విభేదాలను ‘పరిష్కరిస్తారు’ అని భరోసా వ్యక్తం చేశారు.  ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై తదుపరి చర్యలు మంగగళవారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది ట్రంప్ భారత్ లో పర్యటిస్తారని కూడా సెర్గియో తెలిపారు. ప్రధాని మోదీతో ట్రంప్ స్నేహం స్వచ్ఛమైందని, ఇద్దరి మధ్య ఉన్న సమస్యల్ని వారు పరిష్కరించుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. 

‘‘భారత్ -అమెరికా మిత్ర దేశాలు. ఉన్నతస్థాయిలో సంబంధాలు కలిగి ఉన్నాయి. నిజమైన స్నేహితులు కొన్ని అంశాల్లో విబేధించవచ్చు. కానీ, వారి మధ్య సమస్యల్ని పరిష్కరించుకుంటారు. భారత్ ప్రపంచంలోనే పెద్ద దేశం. ఇరు దేశాల మధ్య వాణిజ్యం చాలా అవసరం. వాణిజ్య ఒప్పందంతోపాటు, రక్షణ, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, ఎనర్జీ, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్ వంటి రంగాల్లో ఇరు దేశాల్లో్ కలిసి పని చేయాలి” అని తెలిపారు.

“ప్రపంచంలోని అనేక దేశాలు తిరిగాను. ట్రంప్ తో కలిసి పని చేశా. మోదీతో ట్రంప్ స్నేహం ప్రత్యేకమైందని మాత్రం చెప్పగలను. ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరోస్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చా. ట్రంప్ వచ్చే ఏడాది భారత్ లో పర్యటిస్తారు. ట్రంప్ అర్ధరాత్రి రెండింటికి ఫోన్ చేస్తారు. భారత్ లో టైం వేరే ఉంటుంది కాబట్టి.. ఇది ఆసక్తికరంగా అనిపిస్తుంది’’ అని సెర్గియో వ్యాఖ్యానించారు. 

ప్యాక్స్‌ సిలికా కూటమిలో భారత్​ సభ్యదేశంగా ఉంటుందని సెర్గియో గోర్ ఈ సందర్భంగా ప్రకటించారు. వచ్చే నెలలో జరిగే సమావేశంలో భారత్​ పూర్తి సభ్యత్వాన్ని పొందేందుకు భారత్​ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ట్రేడ్ మాత్రమే కాదు ప్యాక్స్‌ సిలికా వంటి కొత్త వ్యూహాత్మక కార్యక్రమాల్లో కూడా భారత్​- అమెరికా కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

గత నెలలో జపాన్, దక్షిణ కొరియా, యూకే, ఇజ్రాయెల్ దేశాలు చేరాయని, ఇప్పుడు భారత్​ చేరికతో ఈ కూటమి మరితం బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. సిలికాన్‌ సరఫరా కోసం అమెరికా నేతృత్వంలో ప్యాక్స్‌ సిలికా కూటమి ఏర్పాటైంది.