సోషల్ మీడియా వేదికలో అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్‌ను తొలగించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ‘ఎక్స్’ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తన ప్లాట్‌ఫామ్‌లో జరిగిన తప్పులను బాహాటంగా అంగీకరించింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ సంస్థ, తన ఏఐ టూల్ ‘గ్రోక్’ ద్వారా సృష్టిస్తున్న అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌పై చర్యలు తీసుకుంది. భారత ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించిన వెంటనే రంగంలోకి దిగిన ‘ఎక్స్’, ఏకంగా 3,500 అశ్లీల పోస్టులను బ్లాక్ చేసింది.
అంతేకాదు, ఇలాంటి వక్రబుద్ధి కలిగిన పనులు చేసిన 600 మంది యూజర్ల ఖాతాలను శాశ్వతంగా తొలగించింది. భారత చట్టాలకు లోబడి పనిచేస్తామని, ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని కేంద్రానికి లిఖితపూర్వక హామీ ఇచ్చింది. కొద్ది రోజులుగా ‘ఎక్స్’ వేదికగా ఒక ఆందోళనకరమైన ధోరణి మొదలైంది. మస్క్ తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ‘గ్రోక్’ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మహిళల సాధారణ ఫొటోలను తీసుకుని, వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నారు.
గ్రోక్ సాయంతో నగ్న చిత్రాలను సృష్టిస్తున్నారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిపై మహిళా లోకం భగ్గుమంది. ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆందోళన వ్యక్తమైంది. విషయం గమనించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత వారం ‘ఎక్స్’ ఇండియా చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్‌కు నోటీసులు పంపింది.
“మీ ప్లాట్‌ఫామ్‌లో అశ్లీలత పెరిగిపోతోంది. ఏఐని వాడి నగ్న చిత్రాలు సృష్టిస్తున్నారు. వెంటనే దీనిని అడ్డుకోవాలి. మీరు తీసుకున్న చర్యలేంటో మాకు నివేదిక ఇవ్వాలి. దీనికి మీకు ఇస్తున్న సమయం కేవలం 72 గంటలు” అని కేంద్రం డెడ్‌లైన్ విధించింది. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను హోస్ట్ చేసినా, షేర్ చేసినా ఊరుకోబోమని హెచ్చరించింది. ఈ మొత్తం వ్యవహారంలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కీలక పాత్ర పోషించారు.
జనవరి 1నే ఆమె కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఫేక్ అకౌంట్ల ద్వారా మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దుస్తులను తొలగించి, నగ్నంగా చూపించేలా గ్రోక్‌కు కమాండ్స్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మహిళల గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా, నేరపూరిత చర్య అని మండిపడ్డారు. ఆమె ఫిర్యాదుతోనే కేంద్రం వేగంగా స్పందించింది.
అయితే, ఎక్స్ తీసుకున్న మరో నిర్ణయంపై ఎంపీ ప్రియాంక తీవ్ర విమర్శలు చేశారు. అశ్లీల చిత్రాల గొడవ తర్వాత, ‘ఎక్స్’ సంస్థ గ్రోక్ ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను కేవలం ‘ప్రీమియం యూజర్లకు’ మాత్రమే పరిమితం చేసింది. దీనిపై ప్రియాంక మండిపడ్డారు. “సమస్యను పూర్తిగా అరికట్టాల్సింది పోయి, డబ్బులు కట్టిన వారికి మాత్రమే పర్మిషన్ ఇస్తారా? అంటే డబ్బులు చెల్లిస్తే పైశాచిక ఆనందం పొందవచ్చా? డబ్బులు చూపిస్తే మీ నిబంధనలు గాలికి ఎగిరిపోతాయా? సృజనాత్మకత ముసుగులో ఇలాంటి వక్రబుద్ధిని వ్యాపారంగా మార్చుకుంటారా?” అని ఆమె ‘ఎక్స్’ తీరును ఎండగట్టారు.

More Stories
కట్టమైసమ్మ దేవి ఆలయం సమీపంలో మలవిసర్జనతో ఉద్రిక్తత
సోమనాథ్ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇంకా ఉన్నాయి
అత్యాచారం కేసులో బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్