చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని శక్తివంతమైన భారత్ నిర్మించాలి

చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని శక్తివంతమైన భారత్ నిర్మించాలి
చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని శక్తిమంతమైన భారత్ను నిర్మించాలని  జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్ యువతకు పిలుపునిచ్చారు. భారతదేశ స్వాతంత్య్రం ఎన్నో త్యాగాల ఫలితమని, వాటి వెనుక ఉన్న బాధ, అవమానం, జరిగిన నష్టాలను యువత ఎప్పటికీ మరిచిపోవద్దని హితవు చెప్పారు.
డిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటూ తరతరాల భారతీయులు అపారమైన కష్టాలు అనుభవించారని, అవమానాలు భరించారని చెప్పారు. “ఈరోజు మనం చూస్తున్న స్వతంత్ర భారతదేశం ఎప్పుడూ ఇలాగే లేదు. మన ముందు తరాలు దీనికోసం గొప్ప త్యాగాలు చేశారు. వారు తీవ్రమైన అవమానాలను ఎదుర్కొన్నారు” అని అజిత్‌ డోభాల్ చెప్పారు.

“ఎన్నో సందర్భాల్లో అశక్తతతో చూస్తూ ఉండిపోయారు. ఎంతోమంది ఉరిశిక్షలు ఎదుర్కొన్నారు. మన గ్రామాలు కాలిపోయాయి. మన నాగరికత నాశనం అయింది. మన ఆలయాలు దోచుకున్నారు. అయినా మనం మౌనంగా నిలబడ్డాం” అని వ్యాఖ్యానించారు. ఈ చరిత్రే నేటి యువత ముందున్న అసలైన సవాల్‌ అని ఆయన పేర్కొన్నారు. ప్రతి యువకుడి మనసులో ఆవేశం, తపన ఉండాలని చెప్పారు.

ప్రతీకారం అనే పదం సరైనది కాకపోవచ్చని అంగీకరిస్తూనే, చరిత్ర నుంచి వచ్చే ప్రతీకార భావన ఒక శక్తివంతమైన ప్రేరణగా మారాలని ఆయన పేర్కొన్నారు. “మన చరిత్రకు ప్రతీకారం తీర్చుకోవాలి. అది హింస ద్వారా కాదు. మన దేశాన్ని తిరిగి నిలబెట్టడం ద్వారా. మన హక్కులు, మన ఆలోచనలు, మన నమ్మకాలు ఆధారంగా ఒక గొప్ప భారతదేశాన్ని నిర్మించడం ద్వారా ఆ ప్రతీకారం సాధించాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

అయితే, భద్రతా ముప్పులను గుర్తించడంలో గతంలో చేసిన నిర్లక్ష్యం భారతదేశానికి భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని అజిత్ ఢోబాల్ హెచ్చరించారు. శత్రువులను, ముప్పులను తేలికగా తీసుకోవడం వల్లే చరిత్రలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. “భద్రత విషయంలో నిర్లక్ష్యం చేసినప్పుడు చరిత్ర మనకు గుణపాఠం చెప్పింది. ఆ పాఠాన్ని మనం నేర్చుకున్నామా? భవిష్యత్‌ తరాలు దాన్ని గుర్తుంచుకుంటాయా?” అని ఆయన ప్రశ్నించారు. 

 
భవిష్యత్‌ తరాలు ఈ పాఠాన్ని మరిచిపోతే అదే దేశానికి అతిపెద్ద దురదృష్టమని స్పష్టం చేశారు. చరిత్రను మర్చిపోవడమే అత్యంత పెద్ద విషాదమని వ్యాఖ్యానించారు. భద్రత, స్వాభిమానం, జాతీయ విలువల విషయంలో అప్రమత్తత అత్యంత అవసరమని ఆయన యువతకు సూచించారు.