స్వదేశీ వస్తువులకు, మాతృభాషకు ఉన్న ఔన్నత్యాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ మరోసారి నొక్కిచెప్పారు. ప్రజలు స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని, అలాగే ఇంట్లో మాతృభాషలోనే మాట్లాడాలని కోరారు. మనం ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే, ఆత్మనిర్భర్ ఏకైక మార్గమని చెబుతూ అయితే దాన్ని విజయవంతం చేయాడానికి ఏకైక మార్గం స్వదేశీ తెలిపారు.
2047 నాటికి భారత్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని, స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి వ్యాపారులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం రాజస్థాన్ జోధ్‌పుర్‌లో జరిగిన మహేశ్వరి గ్లోబల్ కన్వెన్షన్‌లో ఆయన ప్రసంగిస్తూ “మనం అన్ని రకాల భాషలను నేర్చుకోవాలి, ఇది పురోగతికి అవసరం. కానీ మనం మన మాతృభాషను మర్చిపోకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లలతో మాతృభాషలోనే మాట్లాడాలి. భారత సంస్కృతి, చరిత్ర గురించి వారికి తెలియజేయాలి” అని సూచించారు.
“మాతృభాషతో పాటు అన్ని భాషలను నేర్చుకోవాలి. మహేశ్వరి సమాజానికి చెందిన దాతల జాబితా చాలా పెద్దది. దేశానికి అవసరమైనప్పుడల్లా దోహదపడిన సమాజం. వారు ఉద్యోగ అన్వేషకులు కాదు, ఉద్యోగ సృష్టికర్తలు. స్వాతంత్ర్యం తర్వాత రామాలయ ఉద్యమంలో ప్రాణాలను త్యాగం చేసిన మొదటి ఇద్దరు సోదరులు మహేశ్వరులు అనే వాస్తవం నుంచి సాంస్కృతిక పునరుజ్జీవనానికి వారి సహకారం ప్రాముఖ్యతను అంచనా వేయవచ్చు” అని అమిత్ షా చెప్పారు.
ఈ సందర్భంగా అమిత్ షా ఒక స్టాంపును కూడా విడుదల చేశారు. అందరం ఐక్యతతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. భారత్ పెద్ద ఎత్తున జరిగే సామాజిక వర్గాల సమావేశాలు దేశాన్ని విడదీయవని, పైగా అవి దేశాన్ని మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర హోంమంత్రి తెలిపారు. అన్ని వర్గాలు స్వయం సమృద్ధి సాధించినప్పుడే దేశ స్వావలంబన సాధ్యమని స్పష్టం చేశారు.
“కొందరు తమకు తామే ప్రగతిశీలవాదులమని చెప్పుకునేవారు, ‘మహేశ్వరి ఎక్స్పో’ లాంటి పెద్ద ఎత్తున జరిగే సామాజిక సమావేశాలను విమర్శిస్తుంటారు. వ్యక్తిగతంగా నేను కూడా అలాంటి విమర్శలను చాలా ఎదుర్కొన్నాను. కానీ నా నమ్మకం ఏమిటంటే, ఇలాంటి సామాజిక నిర్మాణాలు భారత్‌ను మరింత బలపరుస్తాయే కానీ, ఏనాడూ విడదీయవు. ప్రతి సామాజిక వర్గం తమలోని అణగారిన వర్గాల సంక్షేమం, భద్రత పట్ల బాధ్యత తీసుకుంటే, దేశం మొత్తానికి మేలు జరుగుతుంది” అని వివరించారు.
“దేశానికి స్వతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఉత్సవాలు జరుపుకున్నాం. ఈ ఉత్సవాల వెనుక 4 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయని అమిత్ షా పేర్కొన్నారు. అవి: ఒకటి 1857 నుంచి 1947 వరకు జరిగిన స్వాతంత్ర్య సంగ్రామం గురించి యువతకు తెలియజేయడం. రెండోది గత 75 ఏళ్లలో దేశం సాధించిన అద్భుత విజయాలను వివరించడం, మూడోది 140 కోట్ల భారతీయుల్లో జాతీయ భావాన్ని, భారతీయతను బలోపేతం చేయడం” అని గుర్తు చేశారు.
కాగా, నాలుగోది 2047 ఆగస్టు 15 నాటికి, భారత స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి ప్రపంచంలోని అన్ని రంగాల్లో భారత్ అగ్రస్థానంలో నిలవాలనే ప్రధాని మోదీ సంకల్పాన్ని నెరవేర్చడం అని తెలిపారు. ఇక చివరిగా సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలి. అప్పుడే 2047 నాటికి భారత్ ప్రతి రంగంలోనూ, ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారుతుందని అమిత్ షా పేర్కొన్నారు.

More Stories
కట్టమైసమ్మ దేవి ఆలయం సమీపంలో మలవిసర్జనతో ఉద్రిక్తత
సోమనాథ్ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇంకా ఉన్నాయి
కేంద్రం హెచ్చరికతో 600 ఖాతాలను తొలగించిన ఎక్స్