వారసత్వ కాంగ్రెస్.. జవసత్వ బీజేపీ !

వారసత్వ కాంగ్రెస్.. జవసత్వ బీజేపీ !
యస్. విష్ణువర్ధన్ రెడ్డి
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు


“కాంగ్రెస్  పేరుతో ఒకప్పుడు అందరూ కలసి దేశం కోసం పోరాడారు , కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ రాజకీయ పార్టీగా మారిన తరువాత కేవలం అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఒక కుటుంబం   నీడలో సేదతీరుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి సంకేతం కాదు, నయా రాచరికానికి నిదర్శనం.” నెహ్రూ హయాం తర్వాత  కాంగ్రెస్ వెళ్తున్న బాటపై  సి.రాజగోపాలాచారి చేసిన వ్యాఖ్యలు ఇవి.   
 
అప్పటికి, ఇప్పటికి మార్పులు రాలేదు సరి కదా మరింతగా కుటుంబ, రాచరిక పోకడల్లోకి కాంగ్రెస్ వెళ్లిపోయింది.  కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉన్న  కాంగ్రెస్ నేత ద్విగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపం ఏమిటో.. బీజేపీకి ఉన్న గొప్పతనం ఏమిటో తన ట్వీట్ తో వెల్లడించారు. ఆయనకు ఇక హైకమాండ్ వద్ద పలుకుబడి ఉండదు. ఎందుకంటే ఆయన నిజం చెప్పారు. అయినా సరే ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ  ఎలా ఉండకూడదో అలా ఉంటోంది కాబట్టి ఆయన మాట్లాడాలనుకున్నారు. మాట్లాడారు.
 
స్వాతంత్ర్యం తెచ్చింది తామేనని చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలింంచడం ప్రారంభించింది.  ఆ పార్టీ  నెహ్రూ నాయకత్వం ఉన్నంత కాలం పార్టీలో భిన్న స్వరాలకు కొంత చోటు ఉండేది. కానీ నెహ్రూ తర్వాత, ముఖ్యంగా ఇందిరా గాంధీ హయాం మొదలయ్యాక, పార్టీలో హైకమాండ్  సంస్కృతి బలపడింది.  పార్టీలోని సీనియర్ నాయకులను పక్కన పెట్టి, కేవలం విధేయతకు  మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం మొదలైంది. అంటే తమ బానిసలకే ప్రాధాన్యం ప్రారంరభించారు.    
 
ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన పార్టీ, ఒకే కుటుంబం చుట్టూ తిరగడం అప్పట్లోనే రాజాజీని కలచివేసింది. రాజాజీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల నుంచి నాయకులు పుట్టడం. కానీ కాంగ్రెస్‌లో నాయకత్వం వారసత్వంగా సంక్రమించడం ప్రారంభమవడాన్ని ఆయన గమనించారు. ఒక రాజు కొడుకు రాజు అయినట్లుగా, నెహ్రూ తర్వాత ఆయన వారసులే దేశాన్ని ఏలాలనే ధోరణిని ఆయన ‘నయా-రాచరికం’ గా అభివర్ణించారు. ఇది స్వాతంత్ర్య పోరాట ఆశయాలకు విరుద్ధమని ఆయన భావించారు.
 
అందుకే  జాజీ 1959లో  స్వతంత్ర పార్టీని స్థాపించారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా, ఉదారవాద ఆర్థిక విధానాలు ,వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించే పార్టీ ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.   కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఒక బలమైన ప్రతిపక్షం లేకపోతే అది నియంతృత్వంగా మారుతుంది అని ఆయన హెచ్చరించేవారు.  ఆ తర్వాత యాభై ఏళ్లుగా కాంగ్రెస్ ఎప్పటికీ మారలేదు. అదే నయా రాచరికాన్ని కొనసాగిస్తోంది. రాజాజి చెప్పింది నిజం చేశారు.

“పార్టీ అనేది ఒక సిద్ధాంతం కోసం పనిచేసే వ్యవస్థ కావాలి కానీ, ఒక వ్యక్తి  ఇష్టాఇష్టాలకు లోబడి నడిచే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారకూడదు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం అనేది సమిష్టిగా ఉండాలి, కేంద్రీకృతం కాకూడదు.” అని ఇలా నయా రాచరిక వ్యవస్థకు బలి అయిన మరో పాత తరం కాంగ్రెస్ నేత నిజలింగప్ప అప్పట్లో చేసిన వ్యాఖ్యలూ ఇప్పుడు గుర్తు చేసుకోవచ్చు.  తమ కుటుంబ ఆధిపత్యాన్ని, రాచరికాన్ని సవాల్ చేసిన బలమైన ప్రతి నేతనూ బయటికి పంపారు.  

 
భారత రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయి, సొంత గూటిని నిర్మించుకుని, ఆపై అదే పార్టీని మట్టికరిపించిన నేతలు ఎంతో మంది ఉన్నారు.  ఢిల్లీ పీఠంపై ఉండే  హైకమాండ్  సంస్కృతిని, ఒకే కుటుంబం చుట్టూ తిరిగే నిర్ణయాధికారాన్ని సవాల్ చేస్తూ బయటకు వచ్చిన నేతలు ప్రాంతీయంగా తిరుగులేని శక్తులుగా ఎదిగారు. రాజాజీ నాడు చెప్పినట్లుగా  నయా-రాచరికం  నుంచి స్వేచ్ఛ కోరుకున్న ఈ నేతలు, కాంగ్రెస్‌ను ప్రాంతీయంగా నామరూపాలు లేకుండా చేయడంలో విజయం సాధించారు. 
 
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు వెన్నెముకగా ఉన్న శరద్ పవార్  సోనియా గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ 1999లో బయటకు వచ్చారు. విదేశీ మూలాలున్న వ్యక్తికి పార్టీ పగ్గాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆయన స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు.  మహారాష్ట్రలో ఎన్సీపీ ప్రభావం గురించి చెప్పాల్సిన పని లేదు. శరద్ పవార్‌తో పాటు పీఏ సంగ్మా, తారిక్ అన్వర్ కూడా తిరుగుబాటు చేశారు.  
 
భారతదేశానికి ప్రధాని అయ్యే వ్యక్తి ఈ దేశంలోనే పుట్టి ఉండాలని, ఇటలీలో పుట్టిన సోనియా గాంధీకి ఆ అర్హత లేదని వారు గళమెత్తారు.  ఇలా ప్రశ్నించడం వల్లనే వారిని పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణంతో వారిని కాంగ్రెస్ నుండి బహిష్కరించారు.  సంగ్మా నేతృత్వంలో నేషనల్ పీపుల్స్ పార్టీ అవతరించింది. ఆ పార్టీ ఈశాన్యంలో ప్రముఖంగా నిలబడింది.

అటు పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టులను ఢీకొనే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్  అనుసరించిన మెతక వైఖరిని, హైకమాండ్ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ కోసం కష్టపడుతున్న నేతల్ని బలి చేస్తున్న తీరును నిరరిస్తూ  నిరసిస్తూ మమతా బెనర్జీ తిరుగుబాటు చేశారు. 1998లో ఆమె స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్, నేడు బెంగాల్‌లో కాంగ్రెస్‌ను ఉనికి చాటుకోలేని స్థితికి నెట్టి, మూడు దశాబ్దాల కమ్యూనిస్ట్ కోటను బద్దలు కొట్టింది.   

 
ఆంధ్రప్రదేశ్   కాంగ్రెస్ పతనానికి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తిరుగుబాటు కారణం.  తన తండ్రి వైఎస్సార్ మరణం తర్వాత అందరూ ఆయనకే మద్దతిచ్చినా సీఎంగా పదవి ఇవ్వలేదు. తాము కోరుకున్న వారికే చాన్స్ ఇచ్చారు.   ఈశాన్య భారతంలో కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి అస్సాంలో ఆ పార్టీ పునాదులను కదిలించిన నేత హిమంత బిశ్వ శర్మ. 
 రాహుల్ గాంధీ నాయకత్వ శైలిని, పార్టీలో దక్కని గౌరవాన్ని ప్రశ్నిస్తూ ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు.
ఆయన నిష్క్రమణతో అస్సాంలోనే కాకుండా మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. బీజేపీలో చేరి ముఖ్యమంత్రిగా ఎదగడమే కాకుండా, కాంగ్రెస్ ముక్త్ నార్త్-ఈస్ట్‌ను సాకారం చేయడంలో ఆయన విజయవంతమయ్యారు.   ఈ నేతలందరి ప్రస్థానాన్ని విశ్లేషిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. వీరంతా కాంగ్రెస్‌లో క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన వారే. అయితే, అధిష్టానానికి విధేయత  కంటే ప్రజాభిప్రాయానికి  కట్టుబడటమే  ముఖ్యం అని భావించి బయటకు వచ్చారు. 
బలమైన ప్రాంతీయ నాయకులను గౌరవించకపోవడం, వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేయడం వల్ల కాంగ్రెస్ తన మేధో సంపత్తిని, ప్రజా బలాన్ని కోల్పోయింది. నేడు అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం కావడానికి కాంగ్రెస్ పార్టీలోని రాచరిక వ్యవస్థ కారణం.   “ఢిల్లీలో నిర్ణయాలు తీసుకునే హైకమాండ్  సంస్కృతి ప్రాంతీయ నేతల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. క్షేత్రస్థాయిలో బలం లేని నాయకులు కేవలం అధిష్టానం కటాక్షం కోసం ఎదురుచూడటం పార్టీ పతనానికి దారితీస్తుంది.” అని పీవీ  నరసింహారావు ఓ సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పారు. 
అది నిజమైన విషయం మన కళ్ల ముందు ఉంది. కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం అనేది కేవలం ఒక నాయకత్వ రూపం మాత్రమే కాదు, అది ఒక అలిఖిత రాజ్యాంగంగా మారిపోయిందనే విమర్శలు దశాబ్దాలుగా ఉన్నాయి.   పార్టీలో ఎంతటి మేధావి అయినా, ప్రజాబలం ఉన్న నేత అయినా గాంధీ కుటుంబం గీసిన గీతను దాటకూడదనే సంప్రదాయం అక్కడ బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలోనే, పార్టీని ప్రక్షాళన చేయాలని కోరిన జి-23  నాయకుల నుంచి మొదలుకొని తాజాగా శశి థరూర్ వరకు.. మార్పును కోరుకున్న వారందర్నీ ఏదో విధంగా బయటకు పంపేశారు.   
 
ఇటీవలి కాలంలో శశి థరూర్ ఉదంతం కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని మరోసారి ప్రశ్నించేలా చేసింది. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ద్వారా ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేసినా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అధికారికంగా ‘హైకమాండ్’ అభ్యర్థి ఎవరూ లేరని ప్రకటించినప్పటికీ, వ్యవస్థ మొత్తం మల్లికార్జున ఖర్గే వెంటే నడిచింది. 
 
పార్టీలో సంస్కరణలు కోరుకున్న థరూర్ వంటి మేధావిని కనీసం ఒక స్టార్ క్యాంపెయినర్‌గా కూడా సరిగ్గా ఉపయోగించుకోకపోవడం, ఆయనను  కనీసం పార్టీ నేతగా కూడా పరిగణించకుండా దూరం పెట్టేశారు.  దీన్ని బట్టి విధేయతకు ఉన్న ప్రాధాన్యత అర్హతకు లేదు అని స్పష్టమవుతోంది.

కాంగ్రెస్ పార్టీలో నేడు ఏ స్థాయి సమావేశం జరిగినా, అది నెహ్రూ-గాంధీ  కుటుంబం పట్ల కృతజ్ఞతను చాటుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు.  పార్టీ అధ్యక్ష పదవిలో లేకపోయినా, కీలక నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీ లేదా సోనియా గాంధీ కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. దీనివల్ల రాష్ట్ర స్థాయిల్లో ఉన్న బలమైన నాయకత్వాలు సైతం ఢిల్లీ నుంచి వచ్చే సంకేతాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. 

 
ఏ నేత అయినా గాంధీ కుటుంబాన్ని చిన్నపాటి విమర్శ చేసినా, తక్షణమే పార్టీలో ఇతర నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవల ఓటు చోరీ అంటూ మతిలేని రాజకీయాన్ని ప్రశ్నించిన కర్ణాటక కాంగ్రెస్ మంత్రిని తెల్లవారే సరికి రాజీనామా కూడా కోరకుండా బర్తరఫ్ చేసి పడేశారు.  ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో నడవాలి కానీ, అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారకూడదనే విమర్శలు ఇప్పుడు కాంగ్రెస్‌ను వెంటాడుతున్నాయి. 
 
పార్టీని నడిపించే నాయకుడు ఎన్నికల్లో విఫలమైనా సరే, అదే కుటుంబం నుంచి మరొకరిని వెతకడం వల్ల కొత్త రక్తం, కొత్త ఆలోచనలు పార్టీలోకి రావడం లేు.  ఈ హైకమాండ్ సెంట్రిక్  విధానం వల్లే హిమంత బిశ్వ శర్మ, జ్యోతిరాదిత్య సింధియా వంటి సమర్థులైన నేతలు పార్టీని వీడాల్సి వచ్చింది. గాంధీ కుటుంబం నీడను దాటి సొంతంగా ఎదిగే ప్రయత్నం చేసే వారికి కాంగ్రెస్‌లో చోటు ఉండదు. అంటే దశాబ్దాలుగా ఏ విధంగా చూసినా కాంగ్రెస్ .. ప్రజాస్వామ్య పద్దతిలో లేదు.

కానీ  భారతీయ జనతా పార్టీ పూర్తి ప్రజాస్వామ్య పద్దతిలో నడుస్తుంది. దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాటలే దీనికి సాక్ష్యం. వాటిని కాదని ఎవరూ అనలేరు.   కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా బిజెపి  పటిష్టమైన సిద్ధాంత పునాదిపై ఆవిర్భవించింది.  బిజెపిలో అధికారం ఒక వ్యక్తి దగ్గర కేంద్రీకృతం కాదు. అది  సంస్థ  చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ సిద్ధాంతం ముఖ్యం, వ్యక్తులు కాదు. 

 
 కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం అనేది చాలా వరకు  పైనుంచి కిందకు    ప్రవహిస్తుంది. గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉండటమే పదవుల దక్కించుకోవడానికి ప్రాథమిక అర్హత.  కానీ బిజెపిలో పరిస్థితులు భిన్నం. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఒకప్పుడు  సామాన్యుడని, ఒక సాధారణ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి దేశ ప్రధాని అయ్యారని ఆ పార్టీ సగర్వంగా చెప్పుకుంటుంది. 
 
అలాగే ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జె.పి. నడ్డా వంటి వారు కూడా కింది స్థాయి నుంచి ఎదిగిన వారే. వెంకయ్యనాయుడు,  కిషన్ రెడ్డి, రాధాక్రిష్ణన్ ,యడియూరప్ప , ప్రమోద్ మహాజన్, సుస్మా స్వరాజ్ , శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలా  అనేకమంది ఉన్నత స్థానాలకు ఎదిగారు.  బీజేపి  ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రోత్సాహం వల్లే విజయం సాధించింది. ఈ మెరిటోక్రసీ   అంటే  అర్హతకే ప్రాధాన్యత  బిజెపి కార్యకర్తల్లో నిరంతరం ఉత్సాహాన్ని నింపుతుంది.

బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా ఎంపిక కావడం  బీజేపీలోని అంతర్గత ప్రజాస్వామ్యానికి , అర్హతకే ప్రాధాన్యత  విధానానికి ఒక నిలువెత్తు నిదర్శనం. రాజకీయ వారసత్వం, కుటుంబ నేపథ్యం ఏమాత్రం లేకపోయినా, కేవలం క్షేత్రస్థాయి కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి తన అంకితభావం, పనితీరుతో అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం బీజేపీ ప్రత్యేకతను చాటిచెబుతోంది. ఇది తాజా ఉదాహరణ మాత్రమే.

 
పార్టీలో ఏ స్థాయిలో చూసినా  ప్రధాని మోదీ దగ్గర నుంచి కింది స్థాయిజిల్లా అధ్యక్షుడి వరకూ అందరూ పార్టీలో పని చేసిన వారే.  వారసత్వ రాజకీయాల నీడలో కొట్టుమిట్టాడుతున్న ఇతర పార్టీలకు భిన్నంగా, బీజేపీలో పదవులు కేవలం సమర్థత , పార్టీ పట్ల నిబద్ధత ఆధారంగానే దక్కుతాయి.  మాన్య కార్యకర్త సైతం పార్టీని నడిపించే స్థాయికి ఎదగగలరనే నమ్మకాన్ని ఈ నిర్ణయం కలిగించడమే కాకుండా, సంస్థాగత నిర్మాణం వ్యక్తిగత ఇష్టాఇష్టాలపై కాకుండా వ్యవస్థాగత పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. 
 
కాంగ్రెస్‌లో నిర్ణయాధికారం అంతా 10 జనపథ్ చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చాలన్నా, టికెట్లు కేటాయించాలన్నా అధిష్టానం కటాక్షం ఉండాల్సిందే. ఇది ప్రాంతీయ నాయకత్వాలను బలహీనపరుస్తుంది. బిజెపిలో నిర్ణయాలు తీసుకోవడానికి పార్లమెంటరీ బోర్డు అనే వ్యవస్థ ఉంటుంది. ఇందులో కీలక నేతలు ఉంటారు. ఏ నిర్ణయమైనా సమిష్టిగా, సంస్థాగత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటారు. 
 
ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని కూడా పార్టీ ప్రయోజనాల కోసం పక్కన పెట్టే సంస్కృతి బిజెపిలో ఉంది. ఆ విషయంపై నేటి రాజకీయలను చూస్తున్న అందరికీ స్పష్టత ఉంది.  ఎన్నికలతో సంబంధం లేకుండా బిజెపి కార్యకర్తలు ప్రజల్లో ఉంటారు.  సిద్ధాంతపరమైన నిబద్ధత  బీజేపీ కార్యకర్తలకు ఉంటుంది.  కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల చుట్టూ తిరుగుతుంటే, బిజెపి కార్యకర్తలు ఓటర్ల చుట్టూ తిరుగుతారు. కాంగ్రెస్‌లో ఎన్నికల సమయంలో మాత్రమే హడావిడి కనిపిస్తుంది, ఆ తర్వాత వ్యవస్థ స్తబ్దుగా మారుతుంది. దీనివల్ల ఎన్నికల వ్యూహరచనలో బీజేపీ  ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటోంది.

అంటే దిగ్విజయ్ సింగ్ చాలా ఆలస్యంగా బయటకు చెప్పారు.కానీ చరిత్రలో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో బానిసత్వాన్ని మాత్రమే పాటిస్తోంది. కానీ భారతీయజనతా పార్టీ అచ్చమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకు సాగుతోంది.  ఆ బానిసత్వానికి అలవాటుపడిన వారు ఇప్పుడు వాస్తవంలోకి వస్తున్నారు కానీ కాంగ్రెస్ బానిసత్వ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదు.