శతాబ్దాల పాటు విదేశీ దాడులు, విధ్వంసాలు జరిగినప్పటికీ సోమనాథ్ ఆలయం భారతీయుల అచంచలమైన ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు తెలిపారు. సోమనాథ్ స్వాభిమాన పర్వ్–2026 సందర్భంగా శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.సోమనాథ్ దేవాలయాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలను అర్పించిన అనేకమంది భారతీయుల త్యాగాలను స్మరించుకోవడానికే ఈ సోమనాథ్ స్వాభిమాన పర్వ్ నిర్వహించబడుతోందని ఆయన తెలిపారు.
ఆ మహనీయుల త్యాగాలు రాబోయే తరాల సాంస్కృతిక చైతన్యానికి ఎల్లప్పటికీ ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పటణ్ వద్ద పశ్చిమ తీరంలో కొలువైన ఈ మహత్తర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, కోట్లాది మంది భక్తుల ప్రార్థనలకు కేంద్రంగా ఉన్న సోమనాథ్ ఆలయం, దురదృష్టవశాత్తు, విదేశీ ఆక్రమణదారుల విధ్వంస లక్ష్యంగా మారిందని ఆయన గుర్తు చేశారు.
2026 సంవత్సరం సోమనాథ్ ఆలయ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన సంవత్సరని చెబుతూ జనవరి 1026లో గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయంపై మొదటి దాడి చేసి విధ్వంసం సృష్టించాడని చెప్పారు. ఇది కేవలం ఒక ఆలయంపై దాడి మాత్రమే కాదని, భారతీయ విశ్వాసం, సంస్కృతి, నాగరికతపై జరిగిన హింసాత్మక, అనాగరిక ప్రయత్నం అని తెలిపారు. ఆ ఘటన భారతీయ చరిత్రలో జరిగిన అత్యంత విషాదకరమైన ఘటనలలో ఒకటిగా నిలిచిందని, 1026 తరువాత అనేక సందర్భాలలో సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఆ తర్వాత సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం మే 11, 1951న పూర్తయ్యిందని రామచందర్ రావు వివరించారు.
అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో జరిగిన సోమనాథ్ ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమం చారిత్రాత్మకమైనదని, అదే రోజున ప్రతిష్ఠతో పాటు ప్రజల దర్శనానికి ఆలయం తెరిచారని చెప్పారు. 2026 సంవత్సరం సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయ్యే అమృత మహోత్సవ సంవత్సరం కావడం విశేషం అని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ పవిత్ర బాధ్యతను సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వయంగా చేపట్టారని చెబుతూ వల్లభాయ్ పటేల్ ప్రేరణతో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం ప్రారంభమైందని ఆయన చెప్పారు.
సోమనాథ్ ఆలయం గజనీ మహమ్మద్, తరువాతి కాలంలో పర్షియన్లు, మొఘలులు, ఇతర విదేశీ ఆక్రమణదారుల దాడులకు గురైందని, అయినప్పటికీ, మన సంస్కృతి, ధర్మం, విశ్వాసం ఎప్పటికీ చెక్కుచెదరలేదని, అందుకే సోమనాథ్ ఆలయం భారతీయ సంస్కృతికి, ధర్మానికి ప్రతీకగా నిలిచిందని బిజెపి నేత వివరించారు. సోమనాథ్ ఆలయంపై జరిగిన దాడికి 1000 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారని తెలిపారు.
ఈ చారిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర ప్రజలందరూ శివాలయాలను సందర్శించి, ఓంకార జపంతో పాటు విశేష పూజలు నిర్వహించాలని ఆయన కోరారు. సోమనాథ్ ఆలయ చరిత్రను, హిందూ ధర్మం గొప్పతనాన్ని స్మరించుకుంటూ మన సంస్కృతి, ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా భాగస్వాములు కావాలని పిలుపిచ్చారు.

More Stories
ఇరాన్ రేవులో చిక్కుకున్న రూ. 2,000 కోట్ల భారత బాస్మతి బియ్యం
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులంటే రక్తపాతమే!
ఖమేనీ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్