రాజా సాబ్ చిత్రం టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తూ హోంశాఖ కార్యదర్శి జారీ చేసిన మెమోను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. థియేటర్లలో నిర్దేశించిన దానికంటే ఎక్కువ ధరలు వసూలు చేయొద్దని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘ది రాజాసాబ్’. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
సినిమాటోగ్రఫీ చట్ట ప్రకారం ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన జీఓ 121 ప్రకారమే టికెట్ ధరలుండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వెంటనే చిత్ర నిర్మాతలకు, థియేటర్ల యాజమాన్యాలకు అందజేయాలని హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. రాజాసాబ్ చిత్రం టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తూ హోంశాఖ జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
టికెట్ ధరలపై హోంశాఖ మెమోలు జారీ చేయొద్దని గతంలో హైకోర్టు ఆదేశించినా వాటిని పరిగణలోకి తీసుకోవడంలేదని విజయ్ గోపాల్ వాదించారు. దీనివల్ల ప్రేక్షకులపై భారం పడుతోందని పేర్కొంటూ తరచూ మెమోలు జారీ చేస్తున్న సంబంధిత అధికారికి రూ.5 లక్షల రూపాయల జరిమానా విధించాలని విజయ్ గోపాల్ కోర్టును కోరారు. హోంశాఖ అధికారులు తెలివిగా చివరి నిమిషంలో ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీఓ 121 ప్రకారమే కోర్టు జారీ చేస్తున్న ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా తిరిగి మెమోలు జారీ చేయడమేంటని హోంశాఖ జీపీని హైకోర్టు ప్రశ్నించింది.
ఒకవేళ ప్రభుత్వం మెమోలు జారీ చేయాలనుకుంటే ప్రస్తుతం ఉన్న జీఓ 120ని మార్చేసి కొత్తగా మరో జీఓ జారీ చేయాలని అసహనం వ్యక్తం చేసింది. జీఓ 120 జారీ సందర్భంగా అన్ని థియేటర్లను పరిగణలోకి తీసుకోలేదని రాజాసాబ్ చిత్ర నిర్మాత ప్రతాప్ వాదించారు. ఆత్యాధునిక థియేటర్లు సైతం ఉన్నాయని వాటికి నిర్ణయించిన ధర మాత్రం సాధారణంగా ఉందని చెప్పారు. సినిమాటోగ్రఫీ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేసుకుంటే వెసులుబాటును ఉపయోగించుకొని హోంశాఖ టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తోందని పేర్కొన్నారు.
ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత మెమోను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హోంశాఖ జీపీని ఆదేశించింది. సంక్రాంతి సీజన్ లో చిరంజీవి చిత్రం శంకర వరప్రసాద్ గారు కూడా విడుదల అవుతూ ఉండడంతో ఆ సినిమాకు కూడా హైకోర్టు నిర్ణయంతో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

More Stories
సోమనాథ్ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక
మనూ భూములను లాక్కోవాలని చూడటం దుర్మార్గం .. ఎబివిపి
ఎస్ఐఆర్ పక్రియ, ఉపాధి చట్టంపై రేవంత్ ఎన్నికలకు వెళ్లగలరా?