డ్రోన్ల ద్వారా భారత్‌లోకి పాక్ ఆయుధాలు పట్టివేత!

డ్రోన్ల ద్వారా భారత్‌లోకి పాక్ ఆయుధాలు పట్టివేత!
 
ఇటీవలి కాలంలో జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో డ్రోన్ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సాంబా, కాఠువా, రాజౌరి వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ డ్రోన్‌ల ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు జారవేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు భద్రతా సంస్థలు చెబుతున్నాయి. తాజా ఘటనలో సాంబా సెక్టార్‌లో డ్రోన్ భారత గగనతలంలోకి చొరబడటం మరోసారి భద్రతా ఆందోళనలను పెంచింది.

జమ్ముకశ్మీర్‌లోని సాంబ సెక్టార్‌లో పాకిస్థాన్ కుట్రను బీఎస్‌ఎఫ్ బలగాలు భగ్నం చేశాయి. డ్రోన్ల ద్వారా భారత్‌లోకి అక్రమంగా తరలిస్తు్న్న ఆయుధాలను పట్టుకున్నారు. సాంబ సెక్టార్‌లో శుక్రవారం రాత్రి సమయంలో సరిహద్దు అవతల నుంచి డ్రోన్ల కదలికలు ఉన్నట్లు బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి. 

ఈ క్రమంలోనే ఫ్లోరా గ్రామంలో డ్రోన్ దిగిందని గమనించి, ఆ చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నది ఒడ్డున పసుపు రంగు టేప్‌తో చుట్టిన ఓ ప్యాకెట్‌ను బలగాలు గుర్తించాయి. అందులో ఆయుధాలు ఉన్నట్లు గమనించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్యాకెట్‌లో ఉన్న రెండు పిస్టల్స్, గ్రెనేడ్, 16 రౌండ్ల బుల్లెట్లు, 3 పిస్టల్ మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు.

డ్రోన్ కదలికలను గుర్తించిన వెంటనే బిఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తం అయ్యాయి. అనుమానాస్పద ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. భద్రతా బలగాల అప్రమత్తత వల్లే ఆయుధాలు ఉగ్రవాదుల చేతికి చేరకుండా అడ్డుకున్నామని బిఎస్ఎఫ్ వర్గాలు స్పష్టం చేశాయి.

ఈ ఘటన నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు భద్రతా బలగాలు హెచ్చరికలు జారీ చేశాయి. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే పోలీసులకు లేదా బిఎస్ఎఫ్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ డ్రోన్ ఘటనపై బిఎస్ఎఫ్ తో పాటు పోలీస్, ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై, ఆయుధాల గమ్యస్థానం ఏమిటన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది.