44 శాతం భారత్ నగరాల్లో విషతుల్యమైన గాలి

44 శాతం భారత్ నగరాల్లో విషతుల్యమైన గాలి

భారతదేశంలో 44 శాతం నగరాలు దీర్ఘకాలికంగా తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. అయితే, ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కేవలం 4 శాతం నగరాలకు మాత్రమే ‘జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం’ కింద రక్షణ లభిస్తోందని ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్’ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇది కేవలం తాత్కాలిక సమస్య కాదని, దేశంలో కాలుష్యం అనేది ఒక నిర్మాణాత్మకమైన సమస్యగా మారిపోయిందని ఆ సంస్థ హెచ్చరించింది.

శాటిలైట్ డేటా ఆధారంగా సీఆర్ఈఏ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. దేశంలోని మొత్తం 4,041 నగరాల్లోని గాలి నాణ్యతను (పీఎం2.5 లెవల్స్) నిశితంగా పరిశీలించింది. ఇందులో ఏకంగా 1,787 నగరాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తేలింది. కరోనా ప్రభావిత 2020ని మినహాయించి, గత ఐదేళ్లుగా (2019-2024) ఈ నగరాల్లో కాలుష్యం జాతీయ ప్రమాణాలను మించిపోయింది. అంటే దేశంలోని 44 శాతం నగరాల ప్రజలు ప్రతిరోజూ విషాన్ని పీల్చుకుంటున్నారు.

2025 అంచనాల ప్రకారం దేశంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాను నివేదిక విడుదల చేసింది. దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా బైర్నిహాట్ (అసోం) నిలిచింది(100 µg/m³). దేశ రాజధాని డిల్లీ రెండో స్థానంలో ఉంది (96 µg/m³). ఘజియాబాద్ (ఉత్తర్ ప్రదేశ్) మూడో స్థానంలో నిలిచింది (93 µg/m³). వీటి తర్వాత నోయిడా, గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా, భివాడి, హాజీపుర్, ముజఫర్‌నగర్, హాపుర్ నగరాలు టాప్-10లో ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్’ క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని నివేదిక స్పష్టం చేసింది. కాలుష్యం బారిన పడ్డ 1,787 నగరాల్లో, ఎన్‌సీఏపీ జాబితాలో ఉన్నవి కేవలం 67 మాత్రమే. అంటే 96 శాతం కాలుష్య నగరాలను ఈ పథకం పట్టించుకోవడం లేదు. మొత్తం మీద కేవలం 130 నగరాలను మాత్రమే ఎన్‌సీఏపీ కవర్ చేస్తోంది. మెజారిటీ నగరాలు క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ పరిధికి దూరంగా ఉండిపోయాయి.

రాష్ట్రాల వారీగా చూస్తే యూపీలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. అత్యధికంగా 416 కాలుష్య నగరాలు ఉత్తర్ప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత రాజస్థాన్ (158), గుజరాత్ (152), మధ్యప్రదేశ్ (143) ఉన్నాయి. పంజాబ్, బీహార్‌లలో చెరో 136 నగరాలు, పశ్చిమ బెంగాల్‌లో 124 నగరాలు కాలుష్యంలో మగ్గుతున్నాయి.

నిధుల వినియోగంలోనూ భారీ లోపాలు ఉన్నట్లు సీఆర్ఈఏ ఎత్తిచూపింది. ఎన్‌సీఏపీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.13,415 కోట్లు విడుదల చేశారు. ఇందులో 74 శాతం నిధులు (రూ.9,929 కోట్లు) ఖర్చు చేశారు. కానీ ఇందులో 68 శాతం డబ్బును కేవలం రోడ్ల మీద దుమ్మును తొలగించడానికే వాడారు. వాహనాల కాలుష్య నివారణకు 14 శాతం, చెత్త దహన నివారణకు 12 శాతం వాడారు. అసలైన కాలుష్య కారకాలైన పరిశ్రమలు, ఇళ్లలో వాడే ఇంధనాల నియంత్రణకు 1 శాతం నిధులు కూడా కేటాయింపలేదు.