ట్రంప్ కు మోదీ ఫోన్ చేయకపోవడమే వాణిజ్య ఒప్పందంకు అడ్డా?

ట్రంప్ కు మోదీ ఫోన్ చేయకపోవడమే వాణిజ్య ఒప్పందంకు అడ్డా?
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫోన్ చేయకపోవడం వల్లే రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని  అమెరికా వాణిజ్య విభాగ కార్యదర్శి హోవర్డ్ లుత్నిక్ చేసిన ప్రకటనను భారత్ తీవ్రంగా ఖండించింది.   న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, అమెరికాతో “పరస్పర ప్రయోజనకరమైన” వాణిజ్య ఒప్పందంపై భారతదేశం ఇప్పటికీ ఆసక్తిగా ఉందని స్పష్టం చేశారు.
 
తాజాగా  లుత్నిక్ ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఎప్పుడో కుదరాల్సి ఉందని, అయితే, అది చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తోందని చెప్పారు. ‘‘ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఆరు దశల చర్చలు జరిగాయి. అలాగే భారత్ పై 50 శాతం టారిఫ్ లు తగ్గించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నాం” అని తెలిపారు. 
 
 అయితే,తుది ఒప్పందం కుదిరే సమయంలో ట్రంప్ కు మోదీ ఫోన్ చేయకపోవడం వల్ల ఒప్పందం కుదరలేదని లుత్నిక్ తెలిపారు. ట్రంప్ కు ఫోన్ చేయాలని మోదీకి సూచించినట్లు కూడా ఆయన తెలిపారు. అయితే, ఈ విషయంలో ఎందుకో భారత్ (మోదీ) అసంతృప్తితో ఉన్నట్లు, అందుకే ఫోన్ చేసి ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో వియత్నాం, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్ వంటి దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందం  కుదుర్చుకున్నట్లు, వీటన్నింటికి ముందే భారత్ తో ఒప్పందం ముగుస్తుందని భావించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
 
కాగా, సమతుల్యమైన, పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందానికి’ రావడానికి భారతదేశం, అమెరికా బహుళ దఫాల చర్చలు జరిపాయని జైస్వాల్ స్పష్టం చేశారు. అనేక సందర్భాల్లో, ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
“వార్తలలో పేర్కొన్న వ్యాఖ్యలలో ఈ చర్చలను వర్ణించిన తీరు కచ్చితమైనది కాదు,” అని జైస్వాల్ పేర్కొన్నారు.
 
“రెండు పరస్పర పూరక ఆర్థిక వ్యవస్థల మధ్య పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందంపై మాకు ఆసక్తి ఉంది. దానిని పూర్తి చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము. యాదృచ్ఛికంగా, 2025 సంవత్సరంలో ప్రధానమంత్రి, అధ్యక్షుడు ట్రంప్ కూడా 8 సార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా మా విస్తృత భాగస్వామ్యంలోని వివిధ అంశాలను చర్చించారు,”  అని వివరించారు.