బంగ్లాలో హిందువులపై దాడుల పట్ల భారత్, బ్రిటన్ ఎంపీ ఆందోళన

బంగ్లాలో హిందువులపై దాడుల పట్ల భారత్, బ్రిటన్ ఎంపీ ఆందోళన
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై కొనసాగుతున్న దాడుల పరంపరపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఖండించింది. ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. 

అతివాద మూకలు హిందువులకు చెందిన ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత శత్రుత్వాలు, రాజకీయ ప్రేరణలతో జరుగుతున్న ఈ ఘటనలు మైనారిటీ వర్గాల్లో భయాందోళనలను పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీల ప్రాణ, ఆస్తి భద్రతను కల్పించడం బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యతేనని భారత విదేశాంగ శాఖ గుర్తుచేసింది.

‘‘బంగ్లాలో మైనారిటీలైన హిందువులపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. హిందువుల ఇండ్లపై, వ్యాపార సంస్థలపైనా అతివాదులు దాడి చేస్తున్నారు. వ్యక్తిగత ద్వేషాలు, రాజకీయ కారణాల వల్ల జరుగుతున్న ఈ మతపరమైన దాడుల్ని వెంటనే ఆపాలి. ఈ దాడులు మైనారిటీలలో భయాన్ని, అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి ’’ అని రణధీర్ తెలిపారు.

బ్రిటన్‌కు చెందిన పార్లమెంట్ సభ్యురాలు ప్రీతీ పటేల్ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ బ్రిటన్ విదేశాంగ కార్యదర్శికి లేఖ రాశారు. దాడుల్ని ఆపేందుకు సహకరించాలని కోరారు.  హిందువులపై హత్యలతో బంగ్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, మత స్వేచ్ఛను గౌరవిస్తూ ఈ దాడులు ఆపేలా చూడాలని ఆమె లేఖలో కోరారు.

మైనారిటీల హక్కులు, మత స్వేచ్ఛను కాపాడేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఆమె కోరారు. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు దక్షిణాసియా ప్రాంత స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.