టీఎంసీ, ఈడీ న్యాయవాదుల మధ్య కోర్టులో తోపులాట

టీఎంసీ, ఈడీ న్యాయవాదుల మధ్య కోర్టులో తోపులాట

పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) న్యాయవాదుల మధ్య హైకోర్టులో తోపులాట జరిగింది. దీంతో గందరగోళం ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కోర్టు రూమ్‌ నుంచి న్యాయమూర్తి వెళ్లిపోయారు. 

బొగ్గు అక్రమ రవాణా కేసుకు సంబంధించి అధికార టీఎంసీ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్‌ కార్యాలయంపై ఈడీ అధికారులు గురువారం దాడి చేయగా, ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆమె పార్టీకి సంబంధించిన కీలక ఫైల్స్‌ తీసుకెళ్లారు. తమ పార్టీ రాజకీయ వ్యూహాలను కొల్లగొట్టేందుకు అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని మమతా బెనర్జీ ఆరోపించారు.

కాగా, సీఎం మమతా బెనర్జీపై సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరుతూ కలకత్తా హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. ఐ-ప్యాక్‌ కార్యాలయంపై రైడ్‌ సందర్భంగా తమ విధులను ఆమె అడ్డుకున్నారని, కీలక ఫైల్స్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకెళ్లారని ఆరోపించింది. మరోవైపు టీఎంసీ కూడా కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఐ-ప్యాక్‌ కార్యాలయంపై దాడి జరిపిన సమయంలో ఈడీ స్వాధీనం చేసుకున్న పత్రాలు తిరిగి ఇవ్వాలని కోరింది. 

అలాగే ఈడీ అధికారులు, సీఆర్పీఎఫ్‌ సిబ్బందిపై రెండు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈడీ, టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్లపై కలకత్తా హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఐ-ప్యాక్ కేసు విచారణ ప్రారంభం కాకముందే కోర్టు హాలులో పరిస్థితి అదుపు తప్పింది. ఈడీ, టీంఎసీ తరుఫు న్యాయవాదులు ఒకరినొకరు తోసుకోవడంతో కోర్టులో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

కాగా, జస్టిస్ సువ్రా ఘోష్ పలుమార్లు హెచ్చరించారు. కేసుతో సంబంధం లేని న్యాయవాదులు ఐదు నిమిషాల్లోపు బయటకు వెళ్లాలని ఆమె కోరారు. లేకపోతే తానే బయటకు వెళ్లిపోతానని చెప్పడంతో న్యాయవాదుల మధ్య గందరగోళం చెలరేగింది. మరోవైపు కోర్టు హాలులో ఎవరు ఉండాలి, బయటకు ఎవరు వెళ్లాలి అన్న దానిపై న్యాయవాదుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి సువ్రా ఘోష్ సీరియస్‌ అయి ఈడీ, టీఎంసీ దాఖలు చేసిన రెండు కేసుల విచారణలను జనవరి 14కు వాయిదా వేశారు. ఆ తర్వాత కోర్టు రూమ్‌ నుంచి బయటకు ఆమె వెళ్లిపోయారు.