సుప్రీం లీడర్ ఖమేనీ వ్యతిరేక నిరసనలతో దేశం అట్టుడుకుతున్నది. రాజకీయ, ఆర్థిక మార్పులు డిమాండు చేస్తూ ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటడంతో గురువారం రాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్లు నిలిచిపోయాయి. భద్రతా దళాలు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 45 మంది మరణించినట్లు అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్తల వార్తాసంస్థ నెట్‌బ్లాక్స్ తెలిపింది.
ప్రవాసంలో ఉన్న ఇరాన్ ప్రతిపక్ష నాయకుడు రేజా పహ్లావీ నిరసనలకు పిలుపునిచ్చిన సమయంలోనే ఇంటర్నెట్ బ్లాక్‌ఔట్ జరగడం గమనార్హం. దేశంలో గతంలో ఎన్నడూ లేనంత ఉధృతంగా జరుగుతున్న నిరసనలతో దేశ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీకి పదవీచ్యుతి తప్పదని ఊహాగానాలు సాగుతున్నాయి. అంతేగాక ఖమేనీ దేశం విడిచి రష్యా పారిపోతారని వార్తలు వస్తున్నాయి.
దేశంలో కొనసాగుతున్న నిరసనలపై ఖమేనీ శుక్రవారం మొదటిసారి స్పందిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతులకు ఇరానియన్ల రక్తపు మరకలు అంటుకున్నాయని, ఆయనను సంతోషపెట్టేందుకే నిరసనకారులు తమ సొంత ఆస్తులను తామే నాశనం చేసుకుంటున్నారని ఖమేనీ మండిపడ్డారు. దేశంలో హింసను రెచ్చగొడుతున్న నిరసనల వెనుక విదేశీ ఏజెంట్లు ఉన్నారని ఖమేనీ ఆరోపించారు. విదేశీ శక్తుల కుయుక్తులకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఇతర దేశాల్లో ఉద్రిక్తతలు రాజేసే బదులు..అమెరికా ముందు తన ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆయన ట్రంప్ కు హితవు పలికారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులను నిరసనలు తెలియచేస్తుంటే వారిని హతమార్చడాన్ని అనుమతించేది లేదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించారు. అయినా ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వారు కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇరాన్‌నుద్దేశించి హెచ్చరించారు.
కాగా, జవనరి 31లోగా ఖమేనీ నాయకత్వం నుంచి ఇరాన్‌కు స్వేచ్ఛ లభిస్తుందంటూ ఇన్వెస్టోపీడియా అనే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ శుక్రవారం జోస్యం చెప్పింది. ఇరాన్ కరెన్సీ రియాల్ పతనం కావడంతో ప్రజల్లో ఆందోళనలు తలెత్తి డిసెంబర్ 28 నుంచి దేశంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని టెహ్రాన్‌లో బజార్లు మూతపడడంతో ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి.
‘ఈ ప్రభుత్వానికి తాను భయపడనని, గత 47 ఏండ్లుగా జీవచ్ఛవంలా బతుకుతున్నా’ అని నిరసనలో పాల్గొన్న ఒక మహిళ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇరానియన్-అమెరికన్ జర్నలిస్టు మసిహ్ అలీనేజాద్ ఒకరు పంచుకున్న ఈ వీడియోలో ఒక మహిళ నోటి నుంచి రక్తం కారుతున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేస్తూ కన్పించింది. ఇస్లామిక్ రిపబ్లిక్‌తో విసిగిపోయిన ఇరాన్‌కు చెందిన ఒక మహిళ గొంతు ఇదని మసిహ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇరాన్ చివరి షా కుమారుడు రెజా పహ్లవి నిరసనలకు బహిరంగంగా మద్దతు ఇచ్చాడు.ప్రస్తుతం ప్రవాసంలో నివసిస్తున్న ఆయన గురువారం మరియు శుక్రవారం రాత్రి 8 గంటలకు వీధుల్లోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. “ఇరాన్ గొప్ప దేశం, ప్రపంచం కళ్ళు మీపై ఉన్నాయి. వీధుల్లోకి రండి. ఐక్యంగా, మీ డిమాండ్లను చాటుకోండి” అని పహ్లవి ఎక్స్ లో రాశారు.
బహిష్కరించిన పహ్లవి రాజవంశానికి మద్దతుగా చాలా మంది ప్రదర్శనకారులు నినాదాలు చేశారు. ఇరాన్ భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంస్కరణవాదిగా పరిగణించబడే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు.అధికారులు “అత్యంత సంయమనం” ప్రదర్శించాలని, “సంభాషణ, నిశ్చితార్థం, ప్రజల డిమాండ్లను వినాలని” ఆయన స్పష్టం చేశారు.
యూరోపియన్ నాయకులు కూడా నిరసనకారులకు మద్దతు తెలిపారు.జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుల్ మాట్లాడుతూ, శాంతియుత ప్రదర్శనకారులపై హింసను అధికంగా ఉపయోగించడాన్ని తాను ఖండిస్తున్నానని, ఇరాన్ అధికారులు తమ అంతర్జాతీయ బాధ్యతలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చాడు. యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలు రాబర్టా మెట్సోలా మాట్లాడుతూ, “ఇరాన్ ధైర్యవంతులైన ప్రజలు నిలబడటం ప్రపంచం మరోసారి చూస్తోంది. యూరప్ వారి పక్షాన నిలుస్తుంది” అని తెలిపారు.
More Stories
పాకిస్థాన్ లో హిందూ యువకుడు కోహ్లీ హత్య
సోమనాథ్ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక
ఇరాన్ రేవులో చిక్కుకున్న రూ. 2,000 కోట్ల భారత బాస్మతి బియ్యం