తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కేసు బలహీనపర్చినట్లుగా స్పష్టం అవుతోందని ఏపీ హైకోర్టు పేర్కొంది. నిందితుడు రవికుమార్, కుటుంబ సభ్యులకు ఆదాయానికి మించిన ఆస్తులపై సిఐడి, ఎసిబి నివేదికలను పరిశీలిస్తే టిటిడిలోని అప్పటి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు రవికుమార్‌తో కుమ్మక్కయ్యా రని పేర్కొంది. దీనిపై సిఐడి, ఎసిబి, డిజిలు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది.
ఎసిబి ప్రాథమిక నివేదిక ప్రకారం రవికుమార్‌ను ప్రభుత్వ అధికారిగా పరిగణించవచ్చునని పేర్కొంది. ఈ కేసులో పిటిషన్‌పై తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేస్తూ జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. టిటిడి బోర్డు తీర్మానం, ఈవో అనుమతి లేకుండానే 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్‌లో ఎవిఎస్‌ఒ వై.సతీష్ కుమార్, నిందితుడు రవికుమార్ రాజీ చేసుకోవడంపై సమగ్ర దర్యాప్తును కొనసాగించాలని సిఐడిని ఆదేశించారు.
చట్ట నిబంధనలను అమలు చేయని అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని టిటిడి, పోలీసు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించింది. పరకామణిలో తక్షణ సంస్కరణలపై టిటిడి సమర్పించిన నివేదిక అస్పష్టంగా ఉందని, ఆచరణయోగ్యమైన ప్రతిపాదనలతో రావాలని మరోసారి ఆదేశించింది. కానుకల లెక్కింపునకు టేబుళ్లు ఏర్పాటు చేయాలన్న కోర్టు సూచన అమలు సాధ్యం కాదని టిటిడి ఈవో పేర్కొనడాన్ని తప్పుపట్టింది.
ఇప్పుడు కానుకలు లెక్కిస్తున్న వారి పట్ల అనుసరిస్తున్న విధానం మానహక్కులను దెబ్బతీసేలా, హుందాతనాన్ని దిగజార్చే విధంగా ఉన్నాయని, ఇవి జీవించే హక్కులను హరించడం కిందకే వస్తుందని అభిప్రాయపడింది. పరకామణిలో చోరీ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అప్పటి టిటిడి ఎవిఎస్‌ఒ, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వై.సతీష్ కుమార్ మతిపై దర్యాప్తును వేగంగా చేయాలని సిఐడిని ఆదేశించింది.
సతీష్ మృతిపై సిఐడి నివేదిక ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో చార్జిషీట్ దాఖలయ్యే వరకు పోలీసుల దర్యాప్తును పర్యవేక్షిస్తామని ప్రకటించింది. ఈ కేసును లోక్‌అదాలత్‌లో రాజీ చేసుకున్న వ్యవహారంపై సిఐడి విచారణకు సింగిల్ జడ్జి ఆదేశించడాన్ని సవాలు చేస్తూ నిందితుడు రవికుమార్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది.
పరకామణి చోరీ కేసులో ఏదో జరగకపోతే రూ.15కోట్లు టిటిడికి ఎందుకు సరెండర్ చేసి కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేసుకుంటారనే సందేహాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని తేల్చి చెప్పింది.

More Stories
‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించండి
పోలవరం ప్రాజెక్టులో 87 శాతం సివిల్ పనులుపూర్తి
పరకామణి కేసులో పొలిసు అధికారులపై క్రిమినల్ కేసులు