పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రక్షణ ఒప్పందం!

పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రక్షణ ఒప్పందం!

భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ధాటికి నాలుగు రోజుల్లోనే చేతులెత్తేసిన పాకిస్థాన్ తో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి బంగ్లాదేశ్ సిద్ధం అవుతోంది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా బంగ్లాదేశ్ వాయుసేన సారథి హసన్ మహమూద్ ఖాన్‌, పాక్ వాయుసేన సారథి మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిధు సమావేశమయ్యారు.  పాక్ నుంచి ‘జేఎఫ్-17 ఠండర్’ యుద్ధ విమానాలను కొంటామనే ఆసక్తిని బంగ్లాదేశ్ వాయుసేన చీఫ్ వ్యక్తం చేశారు. వాటిని అందించేందుకు తాము సిద్ధమేనని పాక్ వాయుసేన చీఫ్ చెప్పారు.

తొలుత శరవేగంగా సూపర్ ముష్షాక్ ట్రైనర్ యుద్ధ విమానాల్ని బంగ్లాదేశ్‌‌కు అందిస్తామని పాక్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విమానాలను నడపడం, సాంకేతికంగా నిర్వహించడంపై దీర్ఘకాలం పాటు శిక్షణ కూడా ఇస్తామని పాక్ తెలిపినట్లు సమాచారం. జేఎఫ్-17 యుద్ధ విమానాల విషయానికొస్తే, వీటిని పాక్, చైనా సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. వీటి తయారీ యూనిట్లు ఇరుదేశాల్లోనూ ఉన్నాయి. ఇది తేలికపాటి యుద్ధ విమానం.

గగనతలంతో శత్రుదేశపు యుద్ధ విమానాలను ఎదుర్కోవడానికి, వైమానిక దాడుల కోసం ఈ విమానం ఉపయోగపడుతుంది. గతేడాది డిసెంబరు 28న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ వేదికగా ఒక కీలక సమావేశం జరిగింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్‌తో బంగ్లాదేశ్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ ఇమ్రాన్ హైదర్ భేటీ అయ్యారు. 

2026 జనవరి నుంచి ఢాకా – కరాచీ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించాలని పాకిస్థాన్ హైకమిషనర్ ఇమ్రాన్ హైదర్ కోరారని మహ్మద్ యూనస్‌ కార్యాలయం మీడియాకు వెల్లడించింది. వాణిజ్యం, పెట్టుబడులు, విమానయానం, విద్య, వైద్యం, సాంస్కృతిక విభాగాల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇమ్రాన్ హైదర్, యూనస్ చర్చించారని పేర్కొంది. 

ఆ తర్వాత వారం రోజులకే  బంగ్లాదేశ్ వాయుసేన చీఫ్ హసన్ మహమూద్ ఖాన్‌ పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లి రక్షణ ఒప్పందంపై చర్చలు మొదలుపెట్టడం గమనార్హం. గతేడాది అక్టోబరులో పాకిస్థాన్ ఆర్మీ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ శంషాద్ మీర్జా కూడా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్‌‌కు ఫోన్ కాల్ చేశారు. 

వారు కూడా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం పెంపుపై చర్చించారని అప్పట్లో యూనస్ కార్యాలయం మీడియాకు వెల్లడించింది. దాదాపు పదేళ్ల తర్వాత జనవరి 29 నుంచి బంగ్లాదేశ్ – పాకిస్థాన్ మధ్య నేరుగా విమాన సర్వీసులు మొదలుకానున్నాయి. ఢాకా – కరాచీ నగరాల మధ్య బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులను నడపనుంది. తొలివిడతలో గురువారం, శనివారం మాత్రమే విమాన సర్వీసులు నడుస్తాయి. చివరిసారిగా 2012లో ఈ దేశాల మధ్య విమాన సర్వీసులు నడిచాయి.