ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారులు ఎదుట 63మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 18 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోహన్ కడ్తీ.. తన భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఈ సందర్భంగా తమ వద్ద ఉన్న ఆయుధాలను పోలీసులకు మావోయిస్టులు అప్పగించారు. ఈ రోజు లొంగిపోయిన మొత్తం మావోయిస్టులపై రూ.కోటి రివార్డు ఉందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లోన్ వర్రాటు (ఇంటికి తిరిగి రండి) ప్రచారంలో భాగంగా వీరంతా లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పట్టిలింగం వీరి లొంగుబాటు శాశ్వత శాంతి, గౌరవం, సమ్మిళిత అభివృద్ధి దిశగా ఒక కీలకమైన చర్యగా అభివర్ణించారు.
కాగా, బుధవారం సుక్మా జిల్లాలో, మొత్తం రూ. 65 లక్షల రివార్డు ఉన్న మరో 13 మందితో సహా ఏకంగా 26 మంది నక్సలైట్లు భద్రతా బలగాల ముందు లొంగిపోయారు. వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. 2025లో రాష్ట్రంలో 1500 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. 2026, మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను శాశ్వతంగా నిర్మూలిస్తామని కేంద్రం ప్రకటించింది. అందుకోసం ఆపరేషన్ కగార్‌ను అమలు చేస్తోంది.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లో వారి ప్రభావం కొంత మేర ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల ఎరివేతకు నిరంతరాయంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దాంతో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుని వందలాది మంది మావోయిస్టులు మరణించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం గతంలో ప్రకటించిన రివార్డులను అందజేస్తోంది.
అదీకాక మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలవడం ద్వారా దేశాభివృద్ధిలో భాగం కావాలంటూ ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం చేపట్టిన కూంబింగ్‌లో పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్ కాగా.. కీలక నేతలు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. మరోవైపు భారీగా వారిని పోలీసులు, భద్రతా సిబ్బంది అరెస్ట్ చేసిన విషయం విదితమే.

More Stories
44 శాతం భారత్ నగరాల్లో విషతుల్యమైన గాలి
ఆస్కార్ రేసులో 4 భారతీయ చిత్రాలు
వీసాలపై భారతీయ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక