అంత‌రిక్ష డేటా సెంట‌ర్ల ఏర్పాటుపై ఇస్రో దృష్టి

అంత‌రిక్ష డేటా సెంట‌ర్ల ఏర్పాటుపై ఇస్రో దృష్టి
భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ(ఇస్రో) అంత‌రిక్షంలో డేటా సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ది. ఆ ప్రణాళిక‌ను అమ‌లు చేసేందుకు ఇస్రో ఓ కార్యాచ‌ర‌ణ చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. భూ క‌క్ష్య‌లో ఫిజిక‌ల్‌గా డేటా సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఇస్రో చైర్మెన్ వీ నారాయ‌ణ‌న్ ఇటీవ‌ల ఓ మీడియాతో పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న అంత‌రిక్ష శాఖ కూడా ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది.

లో ఎర్త్ ఆర్బిట్‌లో డేటా సెంట‌ర్ల‌ను నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. భూమి నుంచి సుమారు 200 నుంచి 2000 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉన్న క‌క్ష్య‌లో లేదా 36 వేల కిలోమీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు ఉన్న జియోస్టేష‌న‌రీ క‌క్ష్య‌లో ఆ డేటా సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసే యోచ‌న‌లో ఇస్రో ఉన్న‌ది. స్పేస్ డేటా సెంట‌ర్ల‌లో కంప్యూటింగ్ హార్డ్‌వేర్‌, స్టోరేజ్ సిస్ట‌మ్స్‌, క‌మ్యూనికేష‌న్ ఎక్విప్మెంట్‌ను ఫిక్స్ చేయ‌నున్నారు. 

భ‌విష్య‌త్తుకు కావాల్సిన‌ టెక్నాల‌జీ కేంద్రాల‌ను నిర్మించాల‌న్న‌ ఉద్దేశంతో అంత‌రిక్షంలో డేటా ప్రాసెసింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఇస్రో చీఫ్ వీ నారాయ‌ణ‌న్ తెలిపారు. అయితే ప్ర‌స్తుతం ప్రాథ‌మిక ప‌నులు మాత్ర‌మే జ‌రిగిన‌ట్లు చెప్పారు. ఓ నివేదిక ప్ర‌కారం ప్ర‌స్తుతం శాటిలైట్లు కేవ‌లం డేటా సేక‌ర‌ణ‌కు మాత్ర‌మే ప‌నిచేస్తున్నాయి. ఇమేజ్‌లు, సిగ్న‌ల్స్ అందుకున్న ఆ ఉప‌గ్ర‌హాలు ఆ త‌ర్వాత గ్రౌండ్ స్టేష‌న్‌లో డౌన్‌లింక్ అవుతున్నాయి. 

అక్క‌డ వాటికి ప్రాసెసింగ్ జ‌రుగుతుంది. అయితే స్పేస్‌లో డేటా సెంట‌ర్ల ఏర్పాటుతో కొత్త ఒర‌వ‌డికి ఇస్రో శ్రీకారం చుట్ట‌నున్న‌ది. ఆన్ బోర్డ్ ప్రాసెసింగ్ తో పాటు శాటిలైట్ కమ్యూనికేష‌న్ డేటా స్టోరేజ్ చేయ‌నున్నారు. క‌క్ష్య‌లోనే శాటిలైట్ డేటాను రీకాన్ఫిగ‌రేష‌న్ చేసే ప్ర‌క్రియ‌పై ఇస్రో దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అప‌రిమిత‌మైన సౌర‌శ‌క్తిని వినియోగించే ఉద్దేశంతో డేటా సెంట‌ర్ల‌ను అంత‌రిక్షంలో ఏర్పాటు చేయాల‌ని టెకీ కంపెనీలు, అంత‌రిక్ష సంస్థ‌లు భావిస్తున్నాయి. స్పేస్ డేటా సెంట‌ర్ల ద్వారా ట్రాన్స్‌మిష‌న్ జాప్యాల‌ను కూడా త‌గ్గించ‌వ‌చ్చు అని అంచ‌నా వేస్తున్నారు.

 స్పేస్‌లోనే డేటా ప్రాసెసింగ్ జ‌ర‌గ‌డం వ‌ల్ల బ్యాండ్‌విడ్త్ సేవ్ అవుతుంద‌ని, దీంతో భూమిపై ఖ‌ర్చుల భారం త‌గ్గుతుంద‌ని అంత‌రిక్ష విశ్లేష‌కుడు గిరీశ్ లింగ‌న్న తెలిపారు. ప్ర‌కృతి విపత్తులు, సైబ‌ర్ దాడులు, రాజ‌కీయ ఉద్రిక్త‌త‌ల నుంచి అంతరిక్ష డేటా సెంటర్ల‌కు ఎటువంటి ప్ర‌మాదం ఉండ‌ద‌ని భావిస్తున్నారు.