ఈ నేపథ్యంలో బీజేపీ- టీఎంసీ మధ్య రాజకీయ పోరు మరింత ముదిరింది. జనవరి 9న కోల్‌కతాలో ఈడీ దాడులకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ నేతృత్వంలో నిరసన చేపట్టనున్నట్లు టీఎంసీ ప్రకటించింది. ఈ ఏడాది తొలి భాగంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. ఈ పరిణామాలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
“ఒక రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి రాజ్యాంగ అమలుకు సహకరించాలి. ప్రజాసేవకుడు తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) ప్రకారం నేరం. అదే విధంగా బెదిరించడం, భయపెట్టడం మరింత తీవ్రమైన నేరం” అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగ హోదాలో ఉన్నారని, ఆమె చర్యలు రాజ్యాంగ పరిధిలో ఉన్నాయా లేదా అన్న అంశంపై నిపుణులతో సంప్రదిస్తున్నట్లు చెప్పారు. అయితే విషయం న్యాయస్థానంలో ఉన్నందున (సబ్‌జుడిస్) తాను తుది వ్యాఖ్య చేయబోనని స్పష్టం చేశారు.
ఈడీ ఇప్పటికే కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. దాడుల సమయంలో అక్రమ జోక్యం జరిగిందని, దర్యాప్తుకు అడ్డంకులు సృష్టించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది. ఈడీ ప్రకారం, బొగ్గు అక్రమ రవాణా కేసులో కీలక ఆధారాల కోసం శాంతియుతంగా తనిఖీలు జరుపుతుండగా ముఖ్యమంత్రి, ఆమె సహచరులు, పోలీసు అధికారులు జోక్యం చేసుకున్నారని ఆరోపించింది. ప్రతీక్ జైన్ నివాసం, ఐ-ప్యాక్ కార్యాలయాల నుంచి కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను బలవంతంగా తీసుకెళ్లారని తెలిపింది.
కాగా, ఐ-ప్యాక్ కేంద్ర దర్యాప్తు సంస్థ తన పరిధిని అతిక్రమించి, మరో రాజకీయ పార్టీ ఆదేశాల మేరకు ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్న ఐ-ప్యాక్ కార్యాలయంపై దాడి చేయడం ద్వారా ఈడీ “నిబంధనలను ఉల్లంఘించిందని” ఆరోపించింది. “ఈ దాడి రాజకీయ ప్రేరేపితమైనది. ఇది ఒక పార్టీకి సేవ చేయడానికి మరో పార్టీని లక్ష్యంగా చేసుకోవడమే దీని ఉద్దేశ్యం,” అని దాని న్యాయవాది పేర్కొన్నారు.
ఇదే సమయంలో టీఎంసీ మాత్రం బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసింది. “ఎన్నికల వ్యూహాలు, పార్టీ పత్రాలు స్వాధీనం చేసుకోవడమే ఈడీ దాడుల అసలు లక్ష్యం. ఇది ప్రజాస్వామ్యంపై దాడి” అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడింది.
More Stories
ఏ ఒక్క నౌకాదళం కూడా ఒంటరిగా సవాళ్లను ఎదుర్కోలేదు
ఏడాదిలో హామీల అమలులో రేఖ గుప్తా ప్రభుత్వం ముందడుగు
ఆఫ్ఘన్ లో గృహ హింసను చట్టబద్దం చేసే కొత్త క్రిమినల్ కోడ్